Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సీట్లు పెరగవు : జగన్ కేసీయార్ లకు ఉమ్మడి షాక్...?

By:  Tupaki Desk   |   27 July 2022 10:46 AM GMT
అసెంబ్లీ సీట్లు పెరగవు : జగన్ కేసీయార్ లకు ఉమ్మడి షాక్...?
X
రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు పెరగవు. ఈ మాటను కేంద్రం చెప్పేసింది. కుండ బద్ధలు కొట్టేసింది. అసలు మా దగ్గర ఇలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేనే లేదని తేల్చేసింది. అలా రెండు రాష్ట్రాల మీద నీళ్ళు జల్లేసింది. ఒక విధంగా చూస్తే జగన్ కేసీయార్ ఇద్దరికీ కలిపి మరీ మోడీ సర్కార్ ఉమ్మడిగా షాక్ ఇచ్చేసింది.

నిజానికి విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం చూస్తే 2014లోని సెక్షన్ 26 (1) రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనల మేరకు సెక్షన్ 15 మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 225, 153 వరుసగా పెరుగుతాయి. అయితే దీని మీద గత ఎనిమిదేళ్ళుగా కేంద్రం ఊరిస్తూనే ఉంది. నిజానికి దీన్ని చేయడానికి కేంద్రానికి పైసా కూడా ఖర్చు ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలకు రాజకీయ లాభం కలుగుతుంది.

పెద్ద ఎత్తున సీట్లు పెరిగితే ఆశావహులకు అందరికీ వాటిని సర్దుకుని మళ్లీ తెలంగాణా ఏపీలలో ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి వచ్చే వీలు ఉంటుంది. ఒక విధంగా చూస్తే ఈ విభజన అధికార పార్టీలకు లాభం. బీజేపీ రెండు చోట్లా పెద్దగా లేని సంగతి తెలిసిందే. ఇక తెలంగాణాలో చూస్తే ఉన్న 119 సీట్లకే బీజేపీ అభ్యర్ధులను వెతుక్కోవాల్సి వస్తోంది.

దాంతో 153 సీట్లు అంటే కష్టమే. అందుకే అన్నీ చూసుకునే సీట్ల పెంపు లేదు అని చల్లగా కబురు చెప్పేసింది అంటున్నారు. దీని మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభలో జవాబు ఇచ్చారు.

ఇప్పట్లో కాదు 2026 నాటికే అప్పటి నూతన జనాభా లెక్కల ప్రకారం ఉంటుంది అని తేల్చేశారు. అంటే 2023లో తెలంగాణాలో, 2024లో ఏపీలో జరిగే ఎన్నికలలో పాత సీట్లతోనే పోటీకి దిగాలన్న మాట. ఒక విధంగా ఇది టీయారెస్, వైసీపీలకు రాజకీయంగా షాక్ అని చెప్పాలి. మరో వైపు చూస్తే ఆనాడు చంద్రబాబు, కేసీయార్ సీట్ల పెంపు మీద చాలానే ప్రయత్నాలు చేశారు.

అయితే అప్పుడు కూడా కుదరలేదు. ఇపుడు చూస్తే జగన్ దీని మీద వత్తిడి తేకపోయినా సీట్లు పెరిగితే లాభమే అని అంచనా వేసుకున్నారు. కేసీయార్ కి అయితే బీజేపీతో చెడింది. దాంతో ఆయన సీట్ల పెంపు మీద గతంలో డిమాండ్ చేసినంతగా ఇపుడు మాట్లాడడంలేదు. ఈ పరిణామాలను గమనంలోకి తీసుకున్న బీజేపీ సీట్ల పెంపు లేదు అంటూ బాంబు పేల్చేసింది. మాకు కేసీయార్ అయినా జగన్ అయినా ఒక్కటే అని స్పష్టం చేసినట్లు అయింది. ఇక పాత సీట్లు అక్కడ సర్వేలు, అక్కడ గెలుపు అవకాశాలు అన్నీ చూసుకుని అధికార పార్టీలు కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాల్సిందే మరి.