Begin typing your search above and press return to search.

ష‌ర్మిల.. చూసుకోవాలి క‌దా!

By:  Tupaki Desk   |   22 Sep 2021 6:52 AM GMT
ష‌ర్మిల.. చూసుకోవాలి క‌దా!
X
రాజ‌కీయ నాయ‌కులు అడుగు బ‌య‌ట పెడితే చాలు చుట్టూ ప్ర‌జ‌లు ఉండాల‌ని కోరుకుంటారు. ఆ ప్ర‌జాబ‌లంతో ముందుకు సాగాల‌ని అనుకుంటారు. అందుకే వివిధ పద్ధ‌తుల్లో జ‌నాన్ని పోగు చేసుకుంటారు. అభిమానంతో వ‌చ్చే వాళ్ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసే రాజ‌కీయ నాయ‌కులు.. మిగతా వాళ్ల‌ను డ‌బ్బు ఆశ చూపించి రప్పిస్తార‌నేది బహిరంగ ర‌హ‌స్యమే. పాద‌యాత్ర‌.. బ‌హిరంగ స‌భ‌.. ఎన్నిక‌ల ప్ర‌చారం.. ఇలా సంద‌ర్భం ఏదైనా ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు నాయ‌కులు ఎన్నో పాట్లు ప‌డ‌తారు. డ‌బ్బుతో పాటు మద్యం, బిర్యానీ అంటూ ప్ర‌జ‌ల‌ను స‌భ‌ల‌కు తీసుకెళ్తారు. కానీ ఆ విష‌యాన్ని బ‌య‌ట ప‌డ‌కుండా చూసుకుంటారు. కానీ ఒక్కోసారి ఆ విష‌యం అనుకోకుండా వెలుగులోకి వ‌స్తే ప‌ర‌వు పోయిన‌ట్లే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ప‌రిస్థితి కూడా అలాగే ఉంది.

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్య స్థాప‌నే ల‌క్ష్యంగా త‌న తండ్రి పేరుతో ష‌ర్మిల పార్టీ పెట్టారు. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ సాగుతున్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌ల‌కెత్తుకున్న ఆమె ప్ర‌తి మంగ‌ళ‌వారం నిర‌స‌న దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే మేడ్చ‌ల్ జిల్లా బోడుప్ప‌ల్‌లో గ‌తంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగి ర‌వీంద‌ర్‌నాయ‌క్ కుటుంబాన్ని మంగ‌ళ‌వారం ప‌రామ‌ర్శించిన ఆమె.. ఆ త‌ర్వాత పీర్జాది గూడ ఎగ్జిబిష‌న్ మైదానంలో నిరుద్యోగ దీక్ష‌కు కూర్చున్నారు. కానీ ఆ దీక్ష‌కు అనుమ‌తి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మేడిప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు పాద‌యాత్ర‌గా వెళ్లాల‌ని ఆమె నిర్ణ‌యించారు. కానీ పోలీసులు ఆమెను అరెస్టు చేసే ప్ర‌యత్నం చేయ‌గా.. వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారిపై ఆమె బైఠాయించారు. చివ‌ర‌కు ఆమెను స‌ముదాయించిన పోలీసులు ష‌ర్మిల‌ను లోట‌స్పాండ్‌కు త‌ర‌లించారు.

ఇక్క‌డి వ‌ర‌కూ అంతా బాగానే సాగింది. పోలీసులు అడ్డుకోవ‌డంతో ష‌ర్మిల నిరుద్యోగ దీక్ష కొన‌సాగ‌లేదు. కానీ ఆ దీక్ష‌కు మొద‌ట కార్య‌క‌ర్త‌లు త‌క్కువ సంఖ్య‌లో రావ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు ఓ ప‌ని చేశారు. అక్క‌డే ఉన్న అడ్డ‌కూలీల ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఒక్కొక్క‌రికి రూ.400 ఇస్తామ‌ని చెప్పి వాళ్ల‌ను దీక్షాస్థ‌లికి తీసుకొచ్చారు. కానీ దీక్ష ఆగిపోవ‌డంతో నాయ‌కులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో త‌మ‌కు డ‌బ్బులు ఇస్తామ‌ని చెప్పి తీసుకొచ్చార‌ని.. ఇప్పుడు త‌మ‌కు డ‌బ్బులు చెల్లించాల్సిందేన‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ష‌ర్మిల‌ది పెయిడ్ దీక్ష అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆమెకు త‌గిన పేరు రావ‌డం లేదు. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేసినా.. నిరుద్యోగ దీక్ష‌లు చేస్తున్నా అనుకున్న మైలేజీ రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆమెకు ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ‌డం మ‌రింత ఇబ్బంది పెట్టేదే. ఆమె ప‌క్క‌న ఉన్న నాయ‌కులు చేసిన ఇలాంటి ప‌ని వ‌ల్ల ఇప్పుడామె ఇబ్బందులు ఎదుర్కొంటుద‌ని అంటున్నారు. కానీ ఓ పార్టీ అధినేత్రిగా ఇలాంటి విష‌యాలు ముందే చూసుకోవాలి క‌దా అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్పుడిదే విష‌యాన్ని ల‌క్ష్యంగా చేసుకుని.. ష‌ర్మిల స‌భ‌కు ప్ర‌జ‌లే రారు.. ఆమె డ‌బ్బులు ఇచ్చి మ‌రీ రంపిస్తార‌ని విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు దొరికిన‌ట్లే క‌దా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.