Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా తీవ్రతకు అదే కారణమా?

By:  Tupaki Desk   |   6 Aug 2020 12:30 AM GMT
ఏపీలో కరోనా తీవ్రతకు అదే కారణమా?
X
కరోనా ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తోంది. ఏపీలో అయితే రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఆ 10వేల మందికి చికిత్స చేద్దామంటే దొరకడం లేదు. వారు ఆస్పత్రులకు వెళ్లడం లేదు. అంతా మిస్ అవుతున్నారు. తప్పుడు అడ్రస్ లతో కరోనా పరీక్షలు చేయించుకొని తప్పించుకుంటున్నారు. అంతా హోం క్వారంటైన్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

కరోనా అని తెలిస్తే అందరూ వెలివేస్తారు.. కాలనీల్లో ఉండనివ్వరు. సమాజంలో వివక్షగా చూస్తారని.. కరోనా టెస్టులను ఏదో లాబీయింగ్ తో చేసుకుంటున్న రోగులు తమకు దగ్గరైన వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ రహస్యంగా తమ ఇళ్లు లేదా తెలిసిన ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమిస్తేనే ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో ఏపీలో కరోనా రోగుల మిస్సింగ్ లు వేలల్లో ఉంటున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్వారా చాలా మందికి కరోనా అంటుతోందని.. అదే కేసుల పెరుగుదలకు కారణమంటున్నారు. కరోనా ట్రేసింగ్ చేయకపోవడమే కేసులు పెరగడానికి కారణంగా చెప్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ తోపాటు ఉత్తర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ రోగులు గుర్తించలేకపోతున్నారని నివేదికలు వచ్చాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే జరుగుతోంది. ప్రధానంగా తాజాగా నెల్లూరులో కూడా అదే జరిగింది. పరీక్ష కోసం వచ్చి పాజిటివ్ గా తేలిన సుమారు 1500 మంది మిస్ అయ్యారు. వారంతా తప్పుడు అడ్రస్ లు ఇవ్వడంతో గుర్తించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

ప్రజల నుండి కరోనా శాంపిల్స్ తరువాత, అధికారులు వారి చిరునామా వివరాలను అడిగి తీసుకుంటున్నారు. వారికి ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. రోగులకు కరోనా అని తేలితే ఆ చిరునామాలో వెతకగా తప్పుడు అడ్రస్ గా తేలుతోంది. అలా నెల్లూరులో పాజిటివ్ గా తేలిన 1500 మంది రోగుల చిరునామాలు తప్పుగా ఉండడంతో వారిని అధికారులు కనుగొనలేకపోతున్నారు.

దీనివల్ల నెల్లూరు జిల్లాలో వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనిపై నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలోకి దిగి, పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలను తాజాగా పర్యవేక్షిస్తున్నారు. తప్పుడు వివరాలు ఇవ్వకుండా రోగులకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా నెల్లూరులో కరోనా కేసుల సంఖ్య 9380కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 5319గా ఉంది.