Begin typing your search above and press return to search.

మొబైల్ వినియోగదారులకు శాంసంగ్ షాక్...

By:  Tupaki Desk   |   29 Oct 2020 1:30 AM
మొబైల్ వినియోగదారులకు శాంసంగ్ షాక్...
X
వ్యాపార రంగంలో కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సంగతి తెలిసిందే. తమకు పోటీదారులైన కంపెనీలపై మార్కెట్లోని మిగతా కంపెనీలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయి. తమకు పోటీగా ఉన్న కంపెనీల ప్రొడక్ట్ తాలూకు వివరాలు, వాటిలో ఏమన్నా లోపాలున్నాయా అన్న ఆరాలు తీస్తూ ట్రోలింగ్ చేస్తుంటాయి. గతంలో, యాపిల్ ఐఫోన్ 12 రిలీజ్ సందర్భంగా ప్రత్యర్థి కంపెనీలయిన శాంసంగ్, షామీ ట్రోల్ చేశాయి. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు చార్జర్, హెడ్ ఫోన్లను ఇవ్వడం లేదని యాపిల్ ప్రకటించడాన్ని శాంసంగ్ సోషల్ మీడియాలో ఎద్దేవా చేసింది. వినియోగదారులకు ఏం కావాలో అది శాంసంగ్ ఇస్తుందంటూ ఆ కంపెనీ గతంలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్ పెట్టినపుడే చాలామంది నెటిజన్లు శాంసంగ్ పై కూడా విమర్శలు గుప్పించారు. కొంతకాలం తర్వాత శాంసంగ్ కూడా యాపిల్ బాటలో నడుస్తుందంటూ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో చేసిన ఆ కామెంట్లకు తగ్గట్టుగానే శాంసంగ్ కూడా ‘శాంసంగ్ గెలాక్సీ 21’ స్మార్ట్‌ఫోన్ తోపాటు ఛార్జర్, ఈయర్‌ఫోన్స్ ఇవ్వబోవడం లేదని ప్రచారం జరుగుతోంది.

బాక్సులో ఛార్జర్లు లేకపోతే ఏటా 2 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను అడ్డుకోగలమని, ప్రతి ఏడాది 450,000 కార్లు రోడ్లపైకి రాకపోవడంతో ఇది సమానమని గతంలో యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చార్జర్ లేకపోవడంతో బాక్స్ సైజ్, ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుందని, దీంతో 70 శాతం ఎక్కువ బాక్సుల్ని డెలివరీ చేయొచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో శాంసంగ్ కూడా త్వరలో విడుదల చేయబోతోన్న ‘శాంసంగ్ గెలాక్సీ 21’లో ఛార్జర్ ఉండదని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు, ఈ ఊహాగానాల్లో వాస్తవం ఉండకపోవచ్చని, ఇయర్‌ఫోన్స్ మాత్రమే తొలగించి ఛార్జర్‌ ఇస్తారని కొందరు అనుకుంటున్నారు. ఈయర్ బడ్స్, వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ని ప్రమోట్ చేయడం కోసమే యాపిల్,వంటి కంపెనీలు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయని, మిగతా కంపెనీలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.