Begin typing your search above and press return to search.

రెమ్ డెసివిర్ కంటే కూడా ఆ మందుతో ప్రయోజనం ఉంటుందట

By:  Tupaki Desk   |   2 May 2021 4:30 PM GMT
రెమ్ డెసివిర్ కంటే కూడా ఆ మందుతో ప్రయోజనం ఉంటుందట
X
కరోనా నేపథ్యంలో దానికి చెక్ పెట్టేందుకు రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు వాడితే సానుకూల ఫలితం ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తోంది. పలువురు వైద్యులు ఈ ఇంజక్షన్ ను సజెక్టు చేయటంతో దీని కోసం పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ ఒక్కక్కటి రూ.18వేల వరకు బ్లాక్ మార్కెట్ లో లభిస్తోంది. వాస్తవానికి దీని అసలుధర కేవలం రూ.3500 మాత్రమే. అయితే..పలువురికి రెమ్‌డెసివిర్‌ మీద నమ్మకం దాన్ని వాడాలని వైద్యులపై ఒత్తిడి తెచ్చే వరకు వెళుతోంది.

ఈ ఇంజెక్షన్ ఇస్తేచాలు.. కరోనా రోగి ప్రాణాల్ని కాపాడుతుందన్న ప్రచారం జరగటం.. భారీగా డిమాండ్ నెలకొంది. అయితే.. పలువురు వైద్యులు మాత్రం రెమ్‌డెసివిర్‌ తో వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గిస్తుందే తప్పించి నియంత్రించలేదని చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ల వల్ల ప్రయోజనం లేదని కోవిడ్ పేషెంట్లకు పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించే గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు సైతం స్పష్టం చేస్తున్నారు.

ఆ మాటకు వస్తే రెమ్‌డెసివిర్‌ కంటే కూడా ఫావిఫిరావిర్ లేదంటే ఫాబి ప్లూ లాంటి మందులు కరోనా సోకిన మూడు నాలుగు రోజుల్లో వాడొచ్చని చెబుతున్నారు. అయితే.. ఇదంతా వైద్యుల సూచనతోనే తప్పించి.. సొంత వైద్యానికి పనికి రాదని చెబుతున్నారు.

అంతేకాదు.. కరోనా తీవ్రతను తగ్గించటంలో డెక్సామెథజోన్ అనే స్టెరాయిడ్బాగా ఉపయోగపడుతుందని. వెంటిలేటర్ల మీద ఉన్న వారికి డెక్సామెథజోన్ గరిష్ఠ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. తేలికపాటి లక్షణాలు ఉన్న వారు దీన్ని వాడకూడదని.. వైరస్ తీవ్రత ఉన్న వారు మాత్రమే వాడాలని చెబుతున్నారు.

వేడినీళ్లతో స్నానం చేయటం.. వేడినీళ్లు తాగటం లాంటి వాటితో కరోనాను నియంత్రించే అవకాశం లేదని.. వేడి నీరు జలుబుకు ఉపశమనం తప్పించి కరోనాను నిరోధించే వీల్లేదని చెబుతున్నారు. కరోనా వైరస్ ను చంపాలంటే 60-70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని.. మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు మించి ఉండని నేపథ్యంలో.. వేడి నీళ్లతో కరోనాను చంపటం సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం అపోమ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు.