Begin typing your search above and press return to search.

చస్తే దహనం - ఖననం లేదు.. దుర్భర స్థితి

By:  Tupaki Desk   |   24 March 2020 9:50 AM GMT
చస్తే దహనం - ఖననం లేదు.. దుర్భర స్థితి
X
సుమారు 60 ఏళ్ల కిందటి ముచ్చట.. అప్పుడు కూడా ఇలాంటి మహమ్మారే దేశాన్ని పట్టి పీడించింది. అవే కలారా.. మశూచీ.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లాగానే ఊళ్లకు ఊళ్లను ఈ కలరా, మశూచీలు నామరూపాల్లేకుండా చేశాయి. అప్పటి జ్ఞాపకాలను ఇప్పుడు మన పెద్దలు గుర్తు చేసుకుంటున్నారు.

60 ఏళ్ల కిందట దేశంలో కలరా - మశూచీ పాకింది. గ్రామాలు - పట్టణాల్లో వేల మంది చావుకు కారణమైంది. అప్పుడు చనిపోయిన వారి మృతదేహాలను కనీసం దహనం కానీ - ఖననం కానీ చేయలేదని నాటి వారు ఈ చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

ఆ నాడు గ్రామాల్లో ఎవరైనా కలారా - మశూచీ తో చనిపోతే వారి మృతదేహాలను యధాతధంగా అలా మంచంపై తీసుకెళ్లి అడవుల్లో వదిలి వచ్చేవారమని బొబ్బలికి చెందిన గ్రామ పెద్దలు చెబుతున్నారు. మృతదేహాలపై బంగారు ఆభరణాలున్నా ఎవరూ తీసేందుకు సాహసించేవారు కాదని గుర్తు చేసుకుంటున్నారు.

నాడు కలరా, మశూచీ రావడం తో బ్రిటీష్ వారు కూడా గ్రామాల్లోకి రావడానికి భయపడేవారని.. అమ్మవారి కరుణ కోసం గ్రామ దేవతలను పెట్టి పూజలు చేసేవారని చెప్పారు. అమ్మవారికి కోళ్లు - మేకలు - పందులు - దున్నపోతులు బలి ఇచ్చేవారమన్నారు.

ఈ కలరా - మశూచీ సోకిన వారు వాంతులు - విరేచనాల తో పిట్టల్లా రాలిపోయారని పెద్దలు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. అలా చనిపోయిన వారి మంచాలు - వారు వాడిన వస్తువులు, -దస్తులు ఊరిబయట లోయలు - గుట్టల్లో పడేసేవారని.. వారి మృతదేహాలను ఖననం - దహనం కూడా చేయకుండా వదిలేసిన ధైన్యం చూశామని తెలిపారు. అంత్యక్రియలు చేస్తే అమ్మవారికి కోపం వస్తుందనే అలా వదిలేసేవాళ్లమని తెలిపారు. శవాల దిబ్బల తో అవి దయ్యాల దిబ్బలుగా మారాయని గుర్తు చేసుకున్నారు.