Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పుట్టిముంచిన రాహుల్‌!

By:  Tupaki Desk   |   8 Dec 2022 10:30 AM GMT
కాంగ్రెస్ పుట్టిముంచిన రాహుల్‌!
X
కొన్ని కొన్ని విష‌యాలు చెప్పుకొనేందుకు, వాటిని అంగీక‌రించేందుకు కూడా చేదుగా ఉంటాయి. ఇప్పుడు గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితం చూసిన త‌ర్వాత‌.. కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఎందుకంటే.. గుజ‌రాత్ వంటి కీల‌క‌మైన రాష్ట్రం. అందునా ప్ర‌ధాని మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్ నామ‌రూపాలు లేకుండా పోయింది. గ‌త 2017 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో 77 స్థానాలు ద‌క్కించుకున్న పార్టీ ఇప్పుడు 20కి ప‌రిమితం అయిపోయింది.

ఈ పాపం నిస్సందేహంగా కాంగ్రెస్ అగ్ర‌నేత, భావి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఆ పార్టీ చెబుతున్న రాహుల్ గాంధీదే న‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాగంటే.. గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు ముందుగానే.. ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. భార‌త్ జోడో యాత్ర ఆయ‌న చేప‌ట్టారు. నిజానికి ఇలాంటి కీల‌క త‌రుణంలో ఆయ‌న చేప‌ట్టిన యాత్ర‌ గుజ‌రాత్‌ పై ప్ర‌భావం చూపుతుంద‌ని.. కాంగ్రెస్ భావించింది.

కానీ, ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక పోయింది. ఎలాంటి చ‌డీ చ‌ప్పుడూ.. లేని ద‌క్షిణాది రాష్ట్రాల్లో రోజుల త‌ర‌బ‌డి పాద‌యాత్ర చేసిన రాహుల్ గుజ‌రాత్ వంక చూసేందుకు ఎందుకో సిగ్గు ప‌డ్డారు. గుజరాత్‌లో 37శాతం ఉన్న ఈ ఓబీసీ ఓటర్లు 90 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. వీరంతా కూడా గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ప‌లికారు.

ఫ‌లితంగానే 77 సీట్లు ద‌క్కాయి. ఈ చిన్న అంశాన్ని గుర్తించి.. వారిని ప్రోత్స‌హించేందుకు కాంగ్రెస్‌ ప్ర‌య‌త్నించ‌లేదు. అంతేకాదు.. 2017 ఎన్నికల సమయంలో గుజరాత్‌ కాంగ్రెస్‌ దివంగత నేత అహ్మద్‌ పటేల్ చ‌క్రం తిప్పారు. కానీ, ఇప్పుడు ఆ త‌ర‌హా నాయ‌కుడు కాంగ్రెస్‌లో లేర‌నే వాస్త‌వం విస్మ‌రించడం కూడా కాంగ్రెస్‌ను పుట్టి ముంచేసింది.

2017లో కాంగ్రెస్‌ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌పటేల్, కీలక కులాలకు ప్రాతినిధ్యం వహించే నేతలు కున్వర్‌జీ బవలియా (కోలి), హార్దిక్‌ పటేల్‌ (పాటీదార్‌), అల్పేశ్‌ ఠాకూర్‌(ఓబీసీ)లు పార్టీపై అసంతృప్తి వ్య‌క్తం చేసినా.. కాంగ్రెస్‌కు చీమ కుట్టిన‌ట్టు కూడాఅనిపించ‌లేదు. ఫ‌లితంగా వారంతా బీజేపీ గూటికి చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ త‌న ప‌డ‌వ‌కు తానే చిల్లులు పెట్టుకున్న‌ట్టు అయింది. ఇలా.. ఎలా చూసుకున్నా.. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఓట‌మి.. రాహుల్ చేసిన వ‌రుస త‌ప్పులే కార‌ణంగా క‌నిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.