Begin typing your search above and press return to search.

షాకింగ్ టాలెంట్: తిరుమల క్యూ లైన్ కు.. వ్యవసాయ చట్టాలకు లింకా?

By:  Tupaki Desk   |   20 Dec 2020 12:10 PM GMT
షాకింగ్ టాలెంట్: తిరుమల క్యూ లైన్ కు.. వ్యవసాయ చట్టాలకు లింకా?
X
జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమేనన్న సామెత అన్ని సందర్భాల్లో సూట్ కాదు. తాజాగా ఇలాంటి సామెతను ప్రస్తావించకుండా తాను చెప్పాల్సిన విషయాన్ని భలేగా చెప్పిన అదిలాబాద్ ఎంపీ అర్వింద్.. తప్పులో కాలేశారని చెప్పాలి. తనకున్న మాటల టాలెంట్ తో విషయాన్ని ఏదోలా పక్కదారి పట్టించేందుకు కాస్త గట్టిగానే అర్వింద్ బాబాయ్ ప్రయత్నించినా వర్కువుట్ కాలేదు.

తాజాగా తిరుమలలోని శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే క్యూలైన్ కు.. దేశ రాజధానిలో రైతులు చేస్తున్న నిరసనకు భలేలాంటి లింకు పెట్టేశారు. మోడీ సర్కారు తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. పార్టీ లైన్ కు తగ్గట్లు అనుకూలంగా మాట్లాడేందుకు ఆయన బాగానే కష్టపడ్డారని చెప్పాలి. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ఏమంటే.. గతంలో తిరుపతికి వెళ్లిన భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి నిలుచోవాల్సి వస్తుందని.. సుదర్శన టికెట్లు రావటంతో శ్రీవారి దర్శనం త్వరగా అయిపోతుందన్నారు.
అలానే కొత్త చట్టాలతో రైతులకు మార్కెట్ యార్డుల్లో నిలుచోవాల్సిన అవసరం ఉండదంటున్నారు.

గతానికి భిన్నంగా కొత్త చట్టంతో రైతులు తమ పంటను త్వరగా అమ్మేసుకొని మార్కెట్ నుంచి బయటకు వచ్చేయొచ్చన్నారు. అంత సింఫుల్ గా వ్యవహారం ఉంటే.. వారాల తరబడి వణికే చలిలో ఉండి నిరసనలు.. ఆందోళనలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? రైతులకు వ్యవసాయ చట్టాలు.. తిరుమల స్వామి వారి దర్శనానికి సుదర్శన టోకెన్లు లాంటివన్న అర్వింద్ వ్యాఖ్య చూస్తే.. ఆయనకు రైతుల క్షేమం కంటే కూడా కమలనాథుల సంక్షేమమే ముఖ్యమన్న విషయం ఆయన చెప్పిన ఉదాహరణలో ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.