Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ ముప్పు లేనట్లే.. నిపుణుల సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   18 Oct 2021 11:35 AM GMT
థర్డ్ వేవ్ ముప్పు లేనట్లే.. నిపుణుల సంచలన ప్రకటన
X
ఫస్ట్ వేవ్ , సెకండ్ వేవ్ తర్వాత కొంతమంది వైరాలజిస్టులు, వైద్యులు అక్టోబర్, నవంబర్‌ లో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేశారు. అయితే, కరోనా మరో దశ ఉద్ధృతి సంకేతాలు లేవని, మహమ్మారి నుంచి బయటపడుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ మధ్య వరకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్స్, ఇతర అధ్యయనాలు వైరస్ మ్యుటేషన్ చెందుతున్నట్టు సంకేతం లేదని, కొత్త వేరియంట్ ఉద్భవించలేదని చెబుతున్నారు. బ్రేక్‌ త్రూ ఇన్‌ ఫెక్షన్ సంభవించినా చాలా స్వల్పంగా, తక్కువ కేసులు ఉంటాయని పేర్కొంటున్నారు.

ఏదిఏమైనా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ప్రజలు కోవిడ్ నిబంధనల పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం, ఆరోగ్య నిపుణులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అప్పటికి దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జినోమిక్ సీక్వెన్సింగ్ తక్కువగా జరుగుతోంది.. పాజిటివ్ శాంపిల్స్ పరీక్షలు ప్రతి రోజూ 10 శాతానికి లోబడి ఉంటాయి అని కర్ణాటక హెల్త్ కమిషనర్ డాక్టర్ రణదీప్ అన్నారు. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకను రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు. చాలా మంది నిపుణులు మహమ్మారి కొత్త వ్యాప్తిని కూడా తోసిపుచ్చారు అని పేర్కొన్నారు.

కర్ణాటక జీనోమ్ సీక్వెన్సింగ్ నోడల్ అధికారి డాక్టర్ రవి మాట్లాడుతూ.. కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌ కు మాత్రమే పరిమితమైందని, ఇన్‌ ఫెక్షన్ రేటు క్షీణిస్తున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపారు. విస్తృత వ్యాక్సినేషన్ కొత్త వేరియంట్‌ లకు దారితీసే మ్యుటేషన్ అవకాశాలు గణనీయంగా తగ్గించి, తీవ్రతను తగ్గిస్తోంది' అన్నారు. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాకు పరిమితమైన C.1.2,Mu వంటి కొత్త వేరియంట్లు భారత్‌లో కనిపించే అవకాశం లేదని ఆయన అన్నారు. ఒక కొత్త వేరియంట్ ఉన్నప్పటికీ ఇది రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా, డెల్టా ప్లస్ మాదిరిగా ప్రాణాంతకం అయ్యే అవకాశం లేదు అని డాక్టర్ రవి చెప్పారు.

అయితే, దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్ రెండో డోస్ పూర్తయ్యే వరకూ కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ రణదీప్ పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ 100 కోట్ల డోస్‌ల మార్క్‌కు చేరువయ్యింది. ఆగస్టులో జరిగిన సెరో సర్వేలో దాదాపు 67.4 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలున్నట్టు వెల్లడయ్యింది. మరి కొద్ది రోజుల్లో చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా జైకోవ్, డీ టీకాలను డీసీజీఐ ఆమోదించింది.