Begin typing your search above and press return to search.

సమయం లేదు...జగన్ తొందరపడాల్సిందేనా.....?

By:  Tupaki Desk   |   30 Sep 2022 9:54 AM GMT
సమయం లేదు...జగన్ తొందరపడాల్సిందేనా.....?
X
ఏపీ సీఎం జగన్ చూస్తూండగానే మూడున్నరేళ్ల పాలనానుభవం గడించారు. ఇక జగన్ చేతిలో అచ్చంగా ఉన్నది 19 నెలలు మాత్రమే. ఇది జగనే స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పిన మాట. గడువు దగ్గరపడుతోంది. టైం చాలా తక్కువగా ఉంది. ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ విషయం చెప్పిన జగన్ కి కూడా అది అర్ధమయ్యే ఉండాలనే అనుకుంటున్నారు అంతా.

ఏపీలో ఎన్నో హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి తీసుకుని వస్తాను అన్నారు. కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో అది కుదరడంలేదని తొలిరోజునే జగన్ కాడె పడేశారు. అయితే అయిదేళ్లలో ఏదైనా అద్భుతం జరుగుతుందా అని జనాలు చూస్తున్నారు. ఒక వేళ జరగకపోతే ఎందుకు జరగలేదు అన్న దానికి జనాలకు జవాబు జగన్ సిద్ధం చేసుకోవాలి.

మరో వైపు చూస్తే విశాఖ రైల్వే జోన్ మీద నాడు చంద్రబాబుని తీవ్రమైన విమర్శలు చేసిన జగన్ ఇపుడు ఆ జోన్ విషయంలో తానూ ఏమీ చేయలేదు అనిపించుకున్నారు. కేంద్రాన్నీఈ రోజుకైనా అడిగో నిగ్గదీసో విశాఖకు రైల్వే జోన్ తేవాల్సిన బాధ్యత అయితే ముఖ్యమంత్రి మీదనే ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానంలో కిడ్నీ సెంటర్ ని ఏర్పాటు చేస్తానని చెప్పి చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

అలాగే పోలవరం ప్రాజెక్టుని జగన్ తండ్రి వైఎస్సార్ స్టార్ట్ చేశారు కాబట్టి జగన్ పూర్తి చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు అది పెద్దగా అడుగులు ముందుకు పడకుండా ఉంది. మరి ఈ విషయంలో కూడా ఆయన జనాలకు తగిన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా జగన్ అనేక కీలక హామీలను వదిలేశారు అని అంటున్నారు.

మరి తన మంత్రులకు ఎమ్మెల్యేలకు చేస్తున్న దిశా నిర్దేశం ఏదో జగన్ కూడా తాను కూడా చేసుకుంటే కేంద్రంతో ఒప్పించో పోరాడో రైల్వే జోన్ లాంటివైనా ఏపీకి తేవచ్చు అంటున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పరుగులు తీయించవచ్చు అని అంటున్నారు. ప్రత్యేక హోదా మాట ఈ మధ్య జగన్ నోట రావడం బాగా తగ్గిపోయింది. మరి ఎన్నికల వేళ ఈ ఒక్క హామీ ప్రభావం చాలానే ఉంటుంది.

ఇక చివరాఖరున ఒక మాట ఎమ్మెల్యేలు అయితే జనాలకు ఏదో ఒకటి చెప్పి తాము చేయలేకపోయామని ఒప్పుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేదని వారు చెప్పుకుంటారు. కానీ జగన్ ఏ రకమైన జవాబులు చెప్పినా జనాలు అయితే అసలు ఒప్పుకోరు ఆయన కేంద్రన్ని మెడలు వంచే మొనగాడు అనే ఓటేశారు. కాబట్టి జగన్ తనకు ఉన్న అతి తక్కువ సమయంలో ఏం చేయాలో తెలుసుకుని వదిలేసిన అసలు హామీల మీద దృష్టి పెడితే 2024 ఎన్నికల్లో వైసీపీ జనంలోకి వెళ్లగలదు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.