Begin typing your search above and press return to search.

బెంగాల్ లో రాష్ట్రప‌తి పాల‌న త‌ప్ప‌దా?

By:  Tupaki Desk   |   11 Jun 2019 7:33 AM GMT
బెంగాల్ లో రాష్ట్రప‌తి పాల‌న త‌ప్ప‌దా?
X
తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పాల‌న‌లోని ప‌శ్చిమ బెంగాల్ లో రాష్ట్రప‌తి పాల‌న దిశ‌గా వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. ఈ సారి ఎలాగైనా బెంగాల్ లో అధికారం చేజిక్కించుకోవాల్సిందేన‌ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... బీజేపీని అడ్డుకోవ‌డమే ల‌క్ష్యంగా దీదీ ర‌చిస్తున్న వ్యూహాలతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఇటు బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు అటు తృణ‌మూల్ కార్య‌క‌ర్త‌లు కూడా ఈ గొడ‌వ‌ల్లో చ‌నిపోతున్నారు. పెద్ద సంఖ్య‌లో గాయాల‌పాల‌య్యారు కూడా. నానాటికీ ఈ గొడ‌వ‌లు పెరిగిపోతుండ‌గా... రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా ఈ గొడ‌వ‌లే చోటుచేసుకుంటున్నాయి. గ‌డ‌చిన నాలుగైదు రోజులుగా ప‌రిస్థితి మరింత టెన్స్ గా మారిపోయింది. ఈ క్ర‌మంలో నిన్న బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ కేస‌రీ నాథ్ త్రిపాఠి హుటాహుటీన ఢిల్లీ వెళ్లారు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు - కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. బెంగాల్ లోని తాజా ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. అల్ల‌ర్లు - ఆ క్ర‌మంలో రాష్ట్రంలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు క‌ట్టు త‌ప్పే ప్ర‌మాదం లేక‌పో్లేద‌న్న కోణంలోనూ ఆయ‌న అమిత్ షాకు వివ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ త‌ర్వాత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కూడా త్రిపాఠి క‌లిశారు. అమిత్ షా వ‌ద్ద ప్ర‌స్తావించిన అంశాల‌నే ఆయ‌న ప్ర‌ధానికి కూడా వివ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బెంగాల్ లో ప‌రిస్థితి చేయి దాటిపోతోంద‌న్న కోణంలోనే త్రిపాఠి నివేదిక‌లున్న‌ట్లుగా స‌మాచారం. ఏద‌నీ రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించాలంటే... ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఇచ్చే నివేదిక‌ను ఆధారం చేసుకునే కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటుంది. మ‌రి ఆ కోణంలోనే ఇప్పుడు బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీకి వెళ్ల‌డం - కేంద్ర హోం మంత్రితో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కూడా క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

బెంగాల్ లో పరిస్థితులు క‌ట్టు త‌ప్పాయ‌న్న కోణంలో గ‌వ‌ర్న‌ర్ నివేదిక ఇస్తే... ఇప్ప‌టిక‌ప్పుడు బెంగాల్ లో రాష్ట్రప‌తి పాల‌న దిశ‌గా మోదీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. తాజా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పిన అమిత్ షా చాలా చోట్ల విజ‌యం సాధించారు. హ్యాండ్ ఫుల్ గా ఎంపీ సీట్ల‌ను సాధించారు. బీజేపీ గెలుపును ఎలాగైనా అడ్డుకోవాల‌న్న దీదీ వ్యూహాలు ఏమాత్రం ఫ‌లించ‌లేదు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌టం... తృణ‌మూల్ - బీజేపీల మ‌ధ్య నిత్యం గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌టం, ఆ క్ర‌మంలోనే రాష్ట్రంలో ప‌రిస్థితులు ఎక్క‌డిక‌క్క‌డ ఉద్రిక్తంగా మారిపోతుంద‌టం, వెనువెంట‌నే ఈ ప‌రిస్థితుల‌పై కేంద్రానికి నివేదించేందుకు గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీకి వెళ్లడం చూస్తుంటే... బెంగాల్ లో రాష్ట్రప‌తి పాల‌న దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ దిశ‌గా కేంద్రం నుంచి ఏ క్ష‌ణ‌మైనా కీల‌క ప్ర‌క‌ట‌న వెలువడే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వార్త‌లు మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.