Begin typing your search above and press return to search.

మహానుభావుడు పట్టాభి పేరును ఈ పట్టాభికి వాడేస్తే ఎలా?

By:  Tupaki Desk   |   21 Oct 2021 12:12 PM IST
మహానుభావుడు పట్టాభి పేరును ఈ పట్టాభికి వాడేస్తే ఎలా?
X
తప్పులో కాలేయొచ్చు. కానీ.. మరీ ఇంతలానా? అన్నట్లుగా వ్యవహరించాయి వైసీపీ శ్రేణులు. తాజాగా టీడీపీ నేత పట్టాభిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారు.. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో.. చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే.

తమ పార్టీ నేతలతో పాటు.. పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు.. మిగిలిన నేతలపైనా దాడులు జరిగిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏపీ టీడీపీ శ్రేణులు బుధవారం బంద్ ను పాటించాయి. దీనికి కౌంటర్ అన్నట్లుగా కొన్నిచోట్ల వైసీపీ శ్రేణులు సైతం తెలుగుదేశం పార్టీ నేతల తీరును నిరసినస్తూ ఆందోళనలు చేపట్టాయి. ఈ సందర్భంగా అనుకోని కొన్ని ఉదంతాలు ఆసక్తికరంగానూ.. ముక్కున వేలేసుకున్నట్లుగా సాగాయి.

పి.గన్నవరంలో ఇలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. తాము నిరసన చేస్తున్నది టీడీపీ నేత కమ్ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారరెడ్డి పట్టాభిరామ్ పేరుకు బదులుగా ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు.. స్వాతంత్ర సమరయోధుడు.. స్వతంత్ర భారత తొలి కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి తీవ్రంగా కృషి చేసిన బోగరాజు పట్టాభి సీతారామయ్య పేరును ఫ్లెక్సీపై రాశారు.

దాన్ని పట్టుకొని వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. తామునిరసన తెలుపుతున్న నేత పేరు కూడా తెలీకుండా ఇలా ఒక పెద్ద మనిషి పేరు మీద నిరసన తెలిపిన వైనంతో ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇలాంటి తప్పులతో నవ్వుల పాలు కావటం ఖాయం. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.