Begin typing your search above and press return to search.

దేశ ప్రజలారా ఊపిరి పీల్చుకోండి.. నాలుగో వేవ్ లేనట్లే

By:  Tupaki Desk   |   9 March 2022 3:29 AM GMT
దేశ ప్రజలారా ఊపిరి పీల్చుకోండి.. నాలుగో వేవ్ లేనట్లే
X
ఒకటి కాదు రెండు కాదు మూడు వేవ్ లతో కరోనా ఎంతలా మానవాళిని ప్రభావితం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం ఇదే సమయానికి మనమంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో? ఎంతటి భయాందోళనలతో ఉన్నామో ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అన్నింటికి మించి.. గత ఏడాది ఏప్రిల్ - మే అన్నది దేశ ప్రజలందరికి పీడకల లాంటిది. అలాంటి దారుణ రోజుల్లో గుర్తు చేసుకోవటానికి సైతం ఎవరూ సాహసించని పరిస్థితి.

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు.. ఏ నిమిషాన ఎవరు ఆసుపత్రి ఐసీయూలో చేరారో.. మరెవరు కాలం చేశారో కూడా గుర్తు పెట్టుకోలేనంత మంది కరోనా మహమ్మారి బారిన పడటం.. కుటుంబాలకు కుటుంబాలకు దారుణంగా దెబ్బ పడటం తెలిసిందే. ముందుగా అంచనా వేసిన దాని కంటే తక్కువగా మూడో వేవ్ ఉందని చెప్పాలి.

అన్నింటికి మించి వ్యాక్సినేషన్ ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టటంతో పాటు.. కేసుల పరంగా చూస్తే.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని చుట్టేసిన మూడో వేవ్.. కేసుల సంఖ్యతో పోల్చినప్పుడు.. తీవ్రత మాత్రం తక్కువగా ఉండటం తెలిసిందే.

మూడో వేవ్ ముగిసిన నాలుగైదు నెలలకు మరో వేవ్ ఉంటుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.ఇది ఖాయంగా ఉంటుందన్న మాట వినిపించింది. అయితే.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ జాకోబ్ జాన్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా మూడో వేవ్ ముగిసిందని.. నాలుగో వేవ్ గురించి ఇందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చేశారు.

పూర్తిగా భిన్నమైన వేరియంట్ ఏదైనా వస్తే తప్పించి.. దేశంలో నాలుగో వేవ్ వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. పాండమిక్ కాస్తా ఎండమిక్ దశకు చేరుకుందని.. అందుకే నాలుగో వేవ్ భయాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా దేశవ్యాప్తంగా కేవలం 3993 కేసులు మాత్రమే నమోదు కావటం. .ఇది 662 రోజుల కనిష్ఠం కావటం గమనార్హం. మూడో వేవ్ ముగిసి.. నాలుగో వేవ్ రాదని తెలిసినప్పటికీ.. అప్రమత్తంగా ఉండటం మాత్రం చాలా అవసరం. తాజా సమాచారం.. దేశ ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకునేలా చేస్తుందనటంలో సందేహం లేదు.