Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా నూతన ఆంక్షలు ఇవే..

By:  Tupaki Desk   |   5 July 2021 9:01 AM GMT
ఏపీలో కరోనా నూతన ఆంక్షలు ఇవే..
X
భారతదేశంపై క‌రోనా మహమ్మారి ఏ స్థాయిలో ప్ర‌భావం చూపిందో తెలిసిందే. ఒక్క రోజు కేసుల సంఖ్య ఏకంగా 4 ల‌క్ష‌లు దాటిపోయింది. మ‌ర‌ణాల సంఖ్య కూడా 4 వేలకుపైగా దాటిపోయింది. ఇలాంటి దారుణ ప‌రిస్థితుల్లోంచి దేశం ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం దేశంలో 40 వేల ద‌గ్గ‌ర కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇదే క్ర‌మంలో రిక‌వ‌రీ కేసులు పెరుగుతుండ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం.

అయితే.. క‌రోనా నియంత్ర‌ణ‌కు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రి స్థానిక ప‌రిస్థితుల మేర‌కు ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించ‌డం.. స‌డ‌లించ‌డం వంటివి చేస్తూ వ‌చ్చాయి. క‌రోనా కేసులు అదుపులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో.. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయ‌గా.. మ‌రికొన్ని చోట్ల స‌డ‌లింపుల‌తో లాక్ డౌన్ కొన‌సాగిస్తూనే ఉన్నాయి.

క‌రోనా తీవ్ర‌త పూర్తిగా త‌గ్గ‌క‌పోవ‌డం.. బ్లాక్‌ ఫంగ‌స్ వంటివి భ‌య‌పెడుతుండ‌డంతో.. ప్ర‌మాదం ఇంకా పూర్తిగా తొల‌గిపోలేదు. అందుకే.. ఇంకా ప‌లు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశారు. కానీ.. ఏపీలో మాత్రం ఇంకా కొన‌సాగుతోంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 94,595 మందిని పరీక్షించగా.. 3175 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో.. 19 లక్షల 2 వేల 923 మంది వైరస్ బారిన పడినట్టు రాష్ట్ర వైద్యాధికారులు ప్రకటించారు. ఇక, గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 29 మంది చనిపోయారు.

ఈ నేప‌థ్యంలో.. కరోనా వేళ‌ల్లో మ‌రిన్ని స‌డ‌లింపులు ఇచ్చారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పాత నిబంధ‌న‌లే అమ‌ల్లో ఉండ‌గా.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలో కొత్త రూల్స్ ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో.. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వ్యాపార కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తులు ఇచ్చారు. మిగ‌తా జిల్లాల్లో మాత్రం ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో క‌రోర‌నా పాజిటివిటీ రేటు 5 శాతం దిగువ‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ ఈ ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని అధికారులు ప్ర‌క‌టించారు.