Begin typing your search above and press return to search.

మహిళ అని చూడకుండా అలా అనేయటమేనా చినప్పల నాయుడు?

By:  Tupaki Desk   |   16 Dec 2022 4:34 AM GMT
మహిళ అని చూడకుండా అలా అనేయటమేనా చినప్పల నాయుడు?
X
ఎన్నికల వేళ ఓటు వేయించుకోవటానికి వచ్చినప్పుడు ప్రదర్శించే వినయం.. ఓపిక.. ఆ ఎన్నికల్లో గెలిచి.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతరించినంతనే ఒంట్లోకి వచ్చే అహంభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. బాధ్యత మీద పడే సరికి మరింత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని కొందరు మర్చిపోతుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి విమర్శల బారిన పడ్డారు బొబ్బలి వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అయిన గడప గడపకూ మన ప్రభుత్వంలో ఆయన తన నియోజకవర్గ పరిధిలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయనకు ఒక అనూహ్య ఘటన ఎదురైంది. బొబ్బిలి పట్టణంలో పర్యటిస్తున్న వేళ.. సునీత అనే మహిళ ఎమ్మెల్యే ముందు తన సమస్యల చిట్టా విప్పారు. ఒక్కొటిగా విన్నంతనే అయ్యో అనిపించేలా ఉన్న ఆమె మాటలు.. ఎమ్మెల్యే చినప్పలనాయుడకు మాత్రం అసహనానికి గురి చేశాయి. ఒంటికాలి మీద ఎగిరేశారు. మీరు నోరు మూసుకుంటే తర్వాత సమాధానం చెబుతానంటూ మండిపాటు విస్మయానికి గురి చేసింది. ఆడబిడ్డ ఆవేదనతో చెబుతున్న మాటల్ని వినే ఓపిక కూడా లేదన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.

గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ ఎమ్మెల్యే చినప్పలనాయుడ్ని చూసిన సునీత అనే మహిళ తన ఆవేదనను వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. 'మాకు సొంతిల్లు లేదు. మా ఇద్దరు పిల్లలకు అమ్మఒడి రాకుండా చేశారు. మావారు ప్రైవేటు టీచరు. మాకు ఎక్కడో దూరంగా ఉన్న స్థలం ఇచ్చారు. వచ్చే జీతంతో ఇల్లు కట్టలేని పరిస్థితి. సచివాలయ సిబ్బంది రోజు వచ్చి ఇల్లు కడతారా? లేదా. అని పీకల మీద కూర్చుంటే పట్టా ఇచ్చేశాం. ప్రభుత్వ పథకాలు ఏవీ రావటం లేదు' అని గుక్క తిప్పుకోకుండా సమస్యల చిట్టా విప్పారు.

దీనికి అసహనానికి గురైన అధికార పార్టీ ఎమ్మెల్యే.."ముందు మీరు నోరు మూసుకుంటే తర్వాత సమాధానం చెబుతా. నేను తప్పుగా అనలేదు. మీరు ఆగకుండా వాగడంతో అధికారులు చెప్పిన సమాధానం మీకు అర్థం కావటం లేదనే అలా అన్నా. అంతకు మించి మరే ఉద్దేశం లేదు' అని వ్యాఖ్యానించారు. ఆరునెల్లలో ఇల్లు కట్టుకోకుంటే రూల్ ప్రకారం రద్దు అవుతుందనే అలా చెప్పి ఉంటారన్న ఆయన.. అమ్మఒడి వచ్చేలా చేస్తానంటూ చెబుతూ వెళ్లిపోయారు. చివర్లో వరాలు ఇచ్చేందుకు వెనుకాడని ఎమ్మెల్యే.. ముందు మాట అనేసే విషయంలోనూ జాగ్రత్త పడి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.