Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించిన మోసగాళ్లు

By:  Tupaki Desk   |   20 Jun 2019 11:01 AM GMT
ఎమ్మెల్యేలను బురిడీ కొట్టించిన మోసగాళ్లు
X
ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఏకంగా ఎమ్మెల్యేలకు బురిడీ కొట్టించిన తాజా సంఘటనలో ఏపీలో కలకలం రేపుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల నుంచి టికెట్లు ఇప్పిస్తామంటూ చంద్రబాబు, జగన్ ల పీఏ నంబర్ నుంచి మార్పింగ్ చేసి ఏకంగా 25 లక్షలు కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఈ దందాలో ఓ ట్రాఫిక్ ఏఎస్ ఐ కుమారుడే కీలక పాత్ర పోషించడం సంచలనంగా మారింది.

స్ఫూఫ్ కాల్స్.. దేశ విదేశాల్లోని ప్రముఖుల నంబర్ నుంచే వస్తున్నట్టు చేసేలా వాట్సాప్ కాల్ చేసే కొత్త ఆధునిక టెక్నాలజీ.. ఈ టెక్నాలజీని ఉపయోగించి విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్ కాలనీకి చెందిన పాండ్రంకి విష్ణుమూర్తి అలియాస్ సాగర్ ఒక ముఠాను తయారు చేశాడు. విష్ణుమూర్తి స్వయంగా ఓ ఏఎస్ఐ కొడుకు కావడం గమనార్హం. ఇతడికి రౌడీ షీటర్ తరుణ్ కుమార్, ఇంజనీరింగ్ స్టూడెంట్ పి. జయకృష్ణ, శ్రీహరిపురానికి చెందిన జగదీష్ తోడయ్యారు. అంతా 30 ఏళ్లు లోపే వారే జనవరిలోనే ఈ వ్యూహం పన్నారు. టీడీపీ, వైసీపీ టికెట్లు ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు బాబు, జగన్ ల పీఏల నంబర్లను హ్యాక్ చేసి వాట్సాప్ ద్వారా కొత్త టెక్నాలజీతో కాల్స్ చేశారు.

మే 7న పెందుర్తి ఎమ్మెల్యే సత్యానారాయణ మూర్తిని చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు నంబర్ నుంచి విష్ణుమూర్తి ఫేక్ కాల్ చేశాడు. సీఎం గారు 10 లక్షలు పార్టీ ఫండ్ పంపించమంటున్నారని.. విదేశీ నంబర్ నుంచి కాల్ చేసి నీ దగ్గరకు వస్తారని తెలిపారు. దీంతో కాల్ రాగానే 10 లక్షలను డ్రైవర్ ద్వారా ఎమ్మెల్యే సత్యనారాయణ పంపించాడు. ఇక ఇలానే పలాస ఎమ్మెల్యే అప్పలరాజుకు ఫోన్ చేయగా.. ఆయన బుట్టలో పడి ఆయన 15 లక్షలను వీరికి అందజేశారు.

ఇలానే విశాఖ దక్షిణ, తూర్పు ఎమ్మెల్యేలకు , మాజీ ఎంపీ మురళీ మోహన్ కు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, కేంద్రమంత్రి గులాంనబీ అజాద్, సుష్మా స్వరాజ్ కు ఫోన్ చేసినా వాళ్లు నమ్మలేదు. ఇక మిగిలిన వారంతా చంద్రబాబు, జగన్ లకు పీఏలకు ఫోన్ చేసి వాకబు చేయడంతో వారు బతికిపోయారు. ఇక మోసపోయిన వ్యవహారం బండారు, గణేష్ కుమార్ లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పల రాజు కూడా కాశీబుగ్గలో ఫిర్యాదు చేయడంతో దీంతో ఈ ఫోన్ కాల్స్, ఐపీ నంబర్ల ఆధారంగా విశాఖ సైబర్ క్రైమ్ సీఐ గోపీనాథ్ కేసును చేధించారు. నిందితుల వద్ద నుంచి 5.8 లక్షల నగదు.. 28 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని విష్ణుమూర్తి సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని ఆట కట్టించారు.