Begin typing your search above and press return to search.

వాళ్ల మాట‌ల్ని వాళ్లిద్ద‌రు ప‌ట్టించుకోలేదు!

By:  Tupaki Desk   |   21 Jun 2019 7:08 AM GMT
వాళ్ల మాట‌ల్ని వాళ్లిద్ద‌రు ప‌ట్టించుకోలేదు!
X
కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ‌కు ఇరుగుపొరుగుగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రుల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆహ్వానించ‌టం తెలిసిందే. అయితే.. వీరి ఆహ్వానం విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు.. బీజేపీ నేత‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఒక అడుగు ముందుకేసి సెంటిమెంట్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని కేసీఆర్ అవ‌మానించార‌ని.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి రావ‌టం అంటే ఆయ‌న తండ్రి వైఎస్ ను జ‌గ‌న్ అవ‌మానించిన‌ట్లే అవుతుంద‌న్న మాట‌ను అనేశారు. అంతేకాదు.. జ‌గ‌న్ కానీ కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి వ‌స్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుంద‌న్న మాట‌ను తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు తెర మీద‌కు తెచ్చారు.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు బీజేపీ నేత‌లు త‌మ పార్టీకి చెందిన మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి రావొద్ద‌ని కోరిన‌ట్లుగా పేర్కొన్నారు. ఇటీవ‌ల ప్ర‌ధానిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఫ‌డ్న‌వీస్ వ‌స్తారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. తండ్రి సెంటిమెంట్ ను తెర మీద‌కు తీసిన నేప‌థ్యంలో జ‌గ‌న్ రాక మీద కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేశారు. అయితే.. రాజ‌కీయంగా చేసే వ్యాఖ్య‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని తాజాగా రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తేల్చేశార‌ని చెప్పాలి.

ఒక మంచి కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకుండా సెంటిమెంట్లు బ‌య‌ట‌కు తీసిన రాజ‌కీయ ప‌క్షాల వ్యూహాల్ని.. త‌న హాజ‌రుతో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు తిప్పి కొట్టార‌ని చెప్ప‌క త‌ప్పక త‌ప్ప‌దు.