Begin typing your search above and press return to search.

వైద్య సిబ్బందికి వరం ఈ నెగిటివ్ ప్రెజర్ వార్డులు

By:  Tupaki Desk   |   25 March 2020 4:30 PM GMT
వైద్య సిబ్బందికి వరం ఈ నెగిటివ్ ప్రెజర్ వార్డులు
X
కరోనా పిశాచి కోరలు చాచడంతో ప్రపంచ దేశాలు ఏంచేయాలో అర్థం కాక తలలుపట్టుకుంటున్నాయి. వైరస్ బారిన పడని ప్రజలను హోం క్వారంటైన్ చేయడం ఒక ఎత్తయితే....వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా సదుపాయాలుండడం మరో ఎత్తు. ఇక, కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది అలసి పోకుండా చూడడం....ఆ సిబ్బందికి వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వీటన్నింటిలో కెల్లా కీలకమైన దశ. ఇప్పటికే కరోనా పాజిటివ్ రోగులకు ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి కరోనా సోకడం....సోకిన వారిలో కొందరు చనిపోవడం కలవరపెట్టే అంశం. తాజాగా కాకినాడలోనూ కరోనా రోగికి చికిత్స చేస్తున్న వైద్యుడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ సోకిన రోగుల విషయంలో కాకినాడ జీజీహెచ్‌ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తోంది. కరోనా రోగులు వదిలిన గాలి ద్వారా వైరస్‌ విస్తరించకుండా ఉండేందుకు జీజీహెచ్‌లో అధునాతన వసతులతో కూడిన నెగిటివ్‌ ప్రెజర్‌ ఐసొలేషన్‌ వార్డులకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.


ఇప్పటికే కాకినాడ జీజీహెచ్ లో ఐసొలేషన్‌ వార్డు కాకుండా మరో 8 గదులను సిద్ధం చేస్తున్నారు. మరో వారంలో ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. రూ.1.30 కోట్ల వ్యయంతో ఎనిమిది నెగిటివ్‌ ప్రెజర్‌ ఐసొలేషన్‌ గదుల్లో...గదికి ఒక కరోనా రోగిని మాత్రమే ఉంచుతారు. ప్రత్యేక పరిజ్ఞానంతో తయారుచేసిన హెపా ఫిల్టర్లున్న ఈ గదులు రోగుల నుంచి ఇతరులను ఇనుప కవచంలా కాపాడుతాయి. కరోనా రోగి వదిలిన గాలిని అక్కడికక్కడే శుద్ధి చేసి....గాలిలో ఉండే వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయి. అతి చిన్న అవశేషాన్ని వదలకుండా మట్టుబెట్టి....వైరస్‌రహిత స్వచ్ఛమైన గాలిని ఫిల్టర్ల ద్వారా బయటకు వదులుతాయి. ఇప్పటివరకు కరోనా రోగులు శ్వాస ద్వారా వదిలేగాలి నేరుగా బయటకు వెళ్లిపోతోంది. దీన్ని పీల్చినా వైరస్‌ బారిన పడి తద్వారా రోగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, ఈ నెగిటివ్ ప్రెజర్ ఐసోలేషన్ వార్డులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు.