Begin typing your search above and press return to search.

స్నిఫ్పర్ డాగ్స్ కు కొత్త డ్యూటీ... కరోనానూ పట్టేస్తాయట

By:  Tupaki Desk   |   28 July 2020 1:30 AM GMT
స్నిఫ్పర్ డాగ్స్ కు కొత్త డ్యూటీ... కరోనానూ పట్టేస్తాయట
X
ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా గురించిన చర్చే. అసలు కరోనాను కట్టడి చేయడం ఎలా? ఎప్పటిలోగా ఈ ప్రాణాంకత మహమ్మారిని అంతం చేయగలం? అన్న దిశగా పెద్ద చర్చలే నడుస్తున్నాయి. అదే సమయంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రోగులను త్వరితగతిన గుర్తించడం, వారిని క్వారంటైన్ కు తరలించడం, వారి నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంపైనే ప్రపంచ దేశాలన్నీ అహోరాత్రులు పనిచేస్తున్నాయి. ఈ బృహత్కార్యంలోకి ఇప్పుడు మనిషికి అత్యంత విశ్వాసపాత్రురాలిగా పరిగణిస్తున్న శునకం కూడా అడుగు పెట్టబోతోంది. విశ్వాసంలో సాటిలేని జాగిలాలు ఇప్ప‌టివ‌ర‌కు పోలీసులకు నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి స‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పై క‌రోనా రోగుల‌ను కూడా అవి గుర్తించ‌నున్నాయి.

వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా.. ఈ వార్త నిజమే. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడం, వారిని ఇట్టే పట్టుకోవడంలో అధికారులకు సహకరించేలా శునకాలకు ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే మొదలైపోయిందట. అంతేకాదండోయ్... ఈ దిశగా కొంతమేర సత్ఫలితాలు కూడా వచ్చాయని కొన్ని దేశాల అధికారులు చెబుతున్నారు. క‌రోనాతో ప్ర‌జలంతా స‌త‌మ‌త‌మవుతోన్న స‌మయంలో..వ్యాధిగ్ర‌స్తుల నిర్దార‌ణ క‌త్తి మీద సాముగా మారింది. ఈ క్రమంలో కరోనా లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు లండన్, అమెరికా వంటి దేశాల్లో స్నిఫ్పర్ డాగ్స్‌కు ట్రైనింగ్ ఇస్తున్నారు. శునకాలకు మంచి శిక్షణ ఇస్తే.. కరోనాను కూడా పసిగడుతున్నాయని సెంటిస్టులు తెలిపారు. అలా క‌నిపెట్ట‌డం ద్వారా వ్యాధి వ్యాప్తిని చాలావ‌ర‌కు అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పటికే పలు దేశాల్లో స్నిప్పర్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. కరోనా లక్షణాలు ఉన్న‌వారిని కనిపెట్టే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారట.