Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి వస్తున్నోళ్లు తెస్తున్న వేరియంట్ లెక్క బయటకు

By:  Tupaki Desk   |   6 Jan 2023 4:25 AM GMT
విదేశాల నుంచి వస్తున్నోళ్లు తెస్తున్న వేరియంట్ లెక్క బయటకు
X
ఏడాది మొత్తం ఒక లెక్క. ఏడాది చివర్లో అంటే డిసెంబరు మధ్య నుంచి జనవరి మొదటి వారం మధ్య దేశానికి వచ్చి వెళ్లే ఎన్ఆర్ఐల సంఖ్య భారీగా ఉంటుందన్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చేటోళ్లు తమతో పాటు వివిధ రకాలైన కరోనా వేరియంట్లను తీసుకొస్తున్న లెక్క ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నెమ్మదించిందని.. దాని పీడ దాదాపు విరగడైపోయిందని సంతోషిస్తున్న వేళ.. తాను ఇంకా పోలేదని.. మరికొంత కాలం తన రచ్చ తప్పదన్నట్లుగా చైనాలో విరుచుకుపడిన బీఎఫ్ 7 వేరియంట్ తేల్చేయటం తెలిసిందే.

లక్షలాది మంది ఈ కొత్త వేరియంట్ ధాటికి విలవిలలాడిపోతున్న వేళ.. ప్రపంచ దేశాలకు ఈ వేరియంట్ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అలెర్టు అయ్యాయి. మన దేశంలోనూ ఈ కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండటమే కాదు.. తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తల్ని తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారి నుంచి శాంపిల్స్ తీసుకోవటం.. వాటిని విశ్లేషించటం.. వారిని అలెర్టు చేయటం లాంటివి చేస్తున్నారు.

రద్దీగా ఉండే విమానాశ్రయాలతో పాటు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ కరోనా నిర్దారణ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరీక్షల ఫలితాలకు సంబందించిన వివరాల్ని వెల్లడించారు.

డిసెంబరు24 నుంచి జనవరి 3 మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు నిర్వహించిన కరోనా పరీక్షల ఫలితాల్ని వెల్లడించారు. విదేశీ ప్రయాణికులకు చేసిన కరోనా పరీక్షలు.. వాటివేరియంట్లను విశ్లేషిస్తే.. దాదాపు 11 రకాల వేరియంట్లతో మన దేశానికి వచ్చినట్లుగా గుర్తించారు.

అయితే.. ఈ వేరియంట్లు అన్ని కూడా మనకు తెలిసినవే కావటం.. కొత్త వేరియంట్లు ఏమీ లేకపోవటంతో కొంతలో కొంత ఊపిరి పీల్చుకునే అంశంగా చెబుతున్నారు. తాజా పరీక్షల్లో బయటకువచ్చిన కొత్త వేరియంట్లు అన్ని కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లేనని స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన 19277మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా.. 124 కేసులు పాజిటివ్ గా తేలినట్లుగా వెల్లడించారు.

ఈ 124 మంది పాజిటివ్ లను జీనోమ్ సీక్వెన్స్ ను చేపట్టగా.. అందులో 14 శాంపిళ్లు ఎక్స్ బీబీ.. ఎక్స్ బీబీ 1 వేరియంట్ గా తేల్చారు. ఒక శాంపిల్ ను బీఎఫ్ 7.41 వేరియంట్ గా గుర్తించారు. ఇప్పటివరకు వెలుగు చూసిన కేసులు.. వాటి వేరియంట్లను చూస్తే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న కేసులు.. వాటి వేరియంట్లు ఏవీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అంతా అండర్ కంట్రోల్ అన్నట్లే ఉందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.