Begin typing your search above and press return to search.

అమరావతిలో దొంగలు పడ్డారు... ?

By:  Tupaki Desk   |   14 Feb 2022 2:30 AM GMT
అమరావతిలో దొంగలు పడ్డారు... ?
X
అమరావతి ఏపీ రాజధాని. ఎవరు కాదన్నా కూడా ఇపుడు అధికార రాజధాని. వైసీపీ నేతలు మూడు రాజధానులు అనవచ్చు. కానీ అది ప్రతిపాదనలో మాత్రమే ఉంది. ఈ మధ్యనే కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా పార్లమెంట్ లో మాట్లాడుతూ ఏపీకి అమరావతి రాజధాని అని తేల్చేశారు. అయితే చంద్రబాబు హయాంలో రోజూ మారుమోగిపోయే అమరావతి జగన్ ఏలుబడిలో మాత్రం దిగనారిపోయింది.

అమరావతిని అభివృద్ధి చేయాలంటే రెండు లక్షల కోట్లు ఉండాలని జగన్ సర్కార్ అంటోంది. అది సరే కానీ మౌలిక సదుపాయాల కల్పన ఏ తీరున ఉంది అంటే అది కూడా దారుణమే అని చెప్పాలి. అసలు అమరావతిని పట్టించుకునే వారే లేరు అని అక్కడ ఉద్యమిస్తున్న రైతులు గోడు పెడుతున్నారు.

అమరావతిలో ప్రభుత్వ భవనాలు కూడా సగం సగం నిర్మాణంలో కొన్ని ఉన్నాయి. వాటి పరిపూర్తి చేయాలంటే నిధులు ఉండాలని అధికారులు అంటున్నారు. దాంతో సగం పూర్తి అయిన భవనాలే దొంగలకు టార్గెట్ అవుతున్నాయట. అక్కడ ఉన్న ఏసీలను, ఎల్ఈడీ లైట్లను, విలవైన ఎలక్ట్రికల్ సామగ్రిని దొంగలు చక్కగా దోచుకుంటున్నారు.

ఎవరూ అడిగేవారు లేరనే రాజధాని ప్రాంతంలో దొంగలు ఇలా తెగబడుతున్నారు అని అంటున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఎలాంటి భద్రతాపరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టలేదు అని అంటున్నారు. ఇదే దొంగలకు కలసి వస్తోంది అని చెబుతున్నారు. వారు అమరావతిలో ఇలాంటి భవనాలను లక్ష్యంగా చేసుకుని మరీ దొరికిన కాడికి దోచేసుకుంటున్నారు.

గతంలో కూడా రోడ్లను తవ్వేసినా పట్టించుకున్న వారు లేరని చెబుతున్నారు. ఇక గ్రావెల్ కి టిప్పర్లు, చాలా సార్లు ట్రాక్టర్లలో తరలించినా ఎవరూ అడిగే సీన్ లేకపోవడం వల్ల ఇపుడు భవనాల్లోని సామగ్రిని కూడా దొంగిలించేస్తున్నారు. చిత్రమేంటి అంటే ప్రస్తుతం దొంగతనాలు జరుగుతున్న ఈ అసంపూర్తి భవనాలు శాసనసభకు, సచివాలయానికి పక్కనే ఉన్నాయట. మరి ఇక్కడి దాకా వచ్చిన దొంగలు రేపటి రోజున అక్కడ కూడా కన్నేస్తే అపుడు సంగతేంటి అన్న ప్రశ్న వస్తోంది.

మొత్తానికి అమరావతి ఇంద్రుడి రాజధాని, ప్రపంచ రాజధాని అని గత సర్కార్ గొప్ప కబుర్లు చెపితే అక్కడ ఏమీ లేదు, అంతా ఖాళీ అని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. దాంతో ఏమైనా మిగిలి ఉంటే దోచేయడానికి మేము రెడీ అని దొంగలు అంటున్నారు. ఇప్పటికైనా అమరావతిలో అసంపూర్తి భవనాలు పూర్తి చేయకపోతే ఉన్నవన్నీ దొంగల పరం అయ్యేలా ఉన్నాయని అంటున్నారు.