Begin typing your search above and press return to search.

క్యాష్ బాక్స్ వదిలి - ఉల్లిపాయలు ఎత్తుకెళ్లిన దొంగలు!

By:  Tupaki Desk   |   28 Nov 2019 5:30 PM GMT
క్యాష్ బాక్స్ వదిలి - ఉల్లిపాయలు ఎత్తుకెళ్లిన దొంగలు!
X
ఉల్లిపాయల ధరల ఘాటు ఏ స్థాయిలో అర్థం చేసుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఒకవైపు నాణ్యమైన ఉల్లిపాయలు మార్కెట్ లో లభ్యం కావడమే కష్టంగా ఉంది. ఒకవేళ లభ్యమైనా ధర భారీ స్థాయికి చేరుతూ ఉంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కేజీ ఉల్లిపాయలు వందల రూపాయల ధరను దాటేశాయి.

ఈ రోజు నుంచి మరింత ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కేజీ నూటా యాభైకి చేరిందని చెబుతూ ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం రైతు బజార్ లలో కేజీ ఉల్లి ఇరవై ఐదు రూపాయలకు ఇస్తూ ఉంది. ఆధార్ కార్డుకు కేజీ చొప్పున అమ్మకాలు సాగుతున్నాయి.

ఈ సంగతలా ఉంటే.. పశ్చిమబెంగాల్ లో ఒక చిత్రమైన దొంగతనం చోటు చేసుకుంది. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఒక కూరగాయల షాపులో దొంగతనం జరిగింది. రాత్రిపూట షాప్ మీద పడిన దొంగలు తమ చేతి వాటం చూపించారు. అయితే వాళ్లు దోచింది కేవలం ఉల్లిపాయలను మాత్రమే!

షాపులోని ఉల్లిపాయలను తీసుకెళ్లిపోయారు. షాపులో ఉన్న ఇతర కూరగాయలను కానీ, ఆఖరికి క్యాష్ బాక్స్ ను కూడా వారు టచ్ చేయలేదట.

తన షాప్ లో దొంగతనం జరిగిందని, దొంగలు క్యాష్ బాక్స్ ను కూడా ముట్టుకోలేదని - కేవలం ఉల్లిపాయలు నింపిన సంచులను మాత్రం ఎత్తుకెళ్లారని ఆ షాప్ యజమాని వాపోతున్నారు. మొత్తానికి ఆ దొంగల సంగతేమో కానీ, ఉల్లిపాయల డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ఈ ఉదంతం చాటుతోంది!