Begin typing your search above and press return to search.

చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ గురించి మీకు తెలియ‌ని విష‌యాలు!

By:  Tupaki Desk   |   15 Oct 2022 11:30 PM GMT
చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ గురించి మీకు తెలియ‌ని విష‌యాలు!
X
2012 నుంచి చైనా అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు.. జీ జిన్‌పింగ్. ఇప్ప‌టికే రెండుసార్లు అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేసుకున్న జిన్‌పింగ్‌.. మ‌రోమారు అంటే మూడోసారి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు అక్టోబర్ 16న జరగనున్న 20వ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌లో అధ్యక్షుడిగా ఆయన పేరును ప్రకటించ‌నున్నారు.

వాస్త‌వానికి 1990 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు చైనా అధ్య‌క్షుడిగా ఎవ‌రైనా రెండుసార్లు మాత్ర‌మే అధికారంలో ఉండే అవ‌కాశం ఉంది. అయితే రాజ్యాంగానికి 2018లో స‌వ‌ర‌ణ చేసి జీవితాంతం అయినా అధికారంలో ఉండేలా మార్చారు. దీంతో మూడోసారి అధ్య‌క్షుడిగా ఎన్నిక కాబోతున్న జిన్‌పింగ్ జీవితాంతం అధికారంలో ఉండ‌టానికి అవ‌కాశం ఉంది.

ప్ర‌స్తుత‌మున్న ప్ర‌పంచ నేత‌ల్లో జీ జిన్‌పింగ్ కు కూడా క‌నిపించ‌ని నియంత‌గా పేరుంది. షిన్‌జియాంగ్‌లో మైనారిటీల‌పై, వీగ‌ర్ ముస్లింల‌పై అకృత్యాలు అన్నీఇన్నీకావు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై అమెరికా నేతృత్వంలో ప్ర‌పంచ దేశాలు చైనాపై మండిప‌డుతున్నాయి.

2012లో తొలిసారి చైనా అధ్య‌క్షుడైన‌ప్ప‌టి నుంచి జిన్‌పింగ్ నిరంకుశుడిగా పేరొందారు. అసమ్మతిని అణచివేయడం, అవినీతి పేరుతో త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ఉరి తీయించ‌డం, ప్ర‌పంచ సోష‌ల్ మీడియా మాధ్య‌మాలు చైనీయులు వాడ‌కుండా నిషేధం విధించ‌డం, కేవ‌లం చైనా ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే ఉండే సోష‌ల్ మీడియానే ప్ర‌జ‌లు వినియోగించేలా చేయ‌డం, చివ‌ర‌కు అలీబాబా లాంటి ప్ర‌పంచ స్థాయి కంపెనీని న‌డిపిప జాక్ మా లాంటి అప‌ర కోటీశ్వ‌రుల‌ను సైతం బెద‌ర‌గొట్టి దేశం నుంచి వెళ్ల‌గొట్ట‌డం, సామాజ్య్ర కాంక్ష‌తో హాంగ్‌కాంగ్‌ను చేజిక్కుంచుకోవ‌డం, తైవాన్‌పై దాడికి ఉబ‌లాటం, భార‌త్‌తోపాటు స‌రిహ‌ద్దు దేశాల ప్రాంతాల ఆక్ర‌మ‌ణ‌ల‌కు న‌డుం క‌ట్ట‌డం ఇలా లెక్క‌కు మిక్కిలి ప‌నుల‌తో జీ జిన్‌పింగ్ న‌యా నియంత‌గా, నిరంకుశడిగా పేరు తెచ్చుకున్నారు.

ఇక ఏకంగా జిన్‌పింగ్ ప్ర‌చార ఉబ‌లాటం ఏ స్థాయికి చేరిందంటే చైనా పితామ‌హులుగా పేరున్న మావో జెడాంగ్‌, డెంగ్ జియావోపింగ్‌ల సూత్రాల‌ను కూడా మార్చేసి త‌న సిద్ధాంతాలే క‌మ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలుగా పార్టీ రాజ్యాంగంలో మార్పించిన ఘ‌నుడు.. జీ జిన్‌పింగ్‌.

ఈ మేర‌కు 2017లో కమ్యూనిస్ట్ పార్టీ... జిన్‌పింగ్ సిద్ధాంతాలను "జీ జిన్‌పింగ్ థాట్ ఆన్ సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది న్యూ ఎరా" పేరుతో రాజ్యాంగంలో చేర్చింది. ఇప్పటివరకు కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్, 1980లలో చైనాలో ఆర్థిక సంస్కరణలకు తెర‌తీసిన‌ నాయకుడు డెంగ్ జియావోపింగ్‌ల సూత్రాలు ముఖ్యమైన ప్రాథమిక చట్టాలుగా ఉన్నాయి.

ఇక జిన్‌పింగ్ జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆయ‌న 1953లో చైనా రాజ‌ధాని బీజింగ్‌లో జన్మించారు. ఆయన తండ్రి విప్లవకారుడు, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జీ జాంగ్‌క్సన్. అయితే, 1962లో జిన్‌పింగ్ తండ్రిని జైల్లో పెట్టారు. అంతేకాకుండా రాజకీయ ప్రముఖుల పిల్లలు చదివే పాఠశాల నుంచి జిన్‌పింగ్‌ను బయటకు పంపించేశారు. 15 ఏళ్ల వయసులో జిన్‌పింగ్‌ను "రీ-ఎడ్యుకేషన్" కోసం బీజింగ్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు పంపారు. చైనాకు ఈశాన్యంలో ఉన్న మారుమూల, పేద గ్రామమైన లియాంగ్జియాహేలో జిన్‌పింగ్ ఏడేళ్లు ఉన్నారు. త‌మ కుటుంబం క‌మ్యూనిస్టు పార్టీలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా జిన్‌పింగ్ దానికి దూరం కాలేదు. పైగా మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు.

1974లో జిన్‌పింగ్‌కు పార్టీలో స్థానం దక్కింది. 1989లో రాజకీయ స్వేచ్ఛను కోరుతూ బీజింగ్‌లోని తియానన్‌మెన్ స్క్వేర్‌లో నిరసనలు చెల‌రేగాయి. ఆ సమయంలో 35 ఏళ్ల జిన్‌పింగ్ దక్షిణ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని నింగ్డే నగరంలో క‌మ్యూనిస్టు పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఈ ప్రావిన్స్ బీజింగ్ కు దూరంగా ఉన్నప్పటికీ భారీ నిర‌స‌న‌లను చెద‌ర‌గొట్ట‌డానికి జిన్‌పింగ్ త‌న వంతు స‌హ‌కార‌మందించారు. దీంతో పార్టీలో జిన్‌పింగ్ ప్రాబ‌ల్యం పెరిగింది. ఎకాఎకిన పార్టీలో అగ్ర‌స్థానానికి చేరారు. ఈ క్ర‌మంలో జిన్‌పింగ్ తొలిసారి 2012లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఇక జిన్‌పింగ్ భార్య పెంగ్ లియువాన్ ప్రముఖ గాయకురాలు. చైనా ప్ర‌థ‌మ మ‌హిళ‌గా జిన్‌పింగ్ అధ్య‌క్షుడ‌య్యాక ఆమెకు భారీ ప్ర‌చారం ల‌భించింది. అప్ప‌టివ‌ర‌కు చైనా అధ్య‌క్షులుగా ఉన్న‌వారి భార్య‌లెవ‌రూ ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చేవారు కాదు. మీడియా కూడా వారిని ప్ర‌థ‌మ మ‌హిళ‌గా గుర్తించేది కాదు. రాజ్యాంగంలోనూ ఈ వెసులుబాట్లు లేవు. జిన్‌పింగ్ హ‌యాంలోనే త‌న స‌తీమ‌ణిని ప్ర‌థ‌మ మ‌హిళ‌గా లోకానికి చాటిచెప్పారు.

కాగా జిన్‌పింగ్ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారని.. ఆమె పేరు జీ మింగ్‌జే అని చెబుతున్నారు. ఆమె అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదివినట్టు చెబుతున్నారు. ఇక ఆమె గురించి ఇత‌ర విష‌యాలు ఏమీ అందుబాటులో లేవు.

కాగా జిన్‌పింగ్ శ‌తాబ్దాల‌కు పూర్వం ఉన్న అవిభ్యాజ్య చైనా సామ్రాజ్యాన్ని స్థాపించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. జిన్‌పింగ్ హ‌యాంలోనే చైనా ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించింది. అంతేకాకుండా కోట్ల డాల‌ర్ల‌తో... ప్ర‌పంచ దేశాల‌ను క‌లుపుతూ వ‌న్ బెల్ట్ వ‌న్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రాజెక్టును జిన్‌పింగ్ ప్రారంభించారు. ఆఫ్రికా, ఆసియా, యూరోప్ దేశాల‌ను ఈ రోడ్‌తో అనుసంధానించ‌డం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. త‌ద్వారా చైనాలో త‌యారైన చౌక వ‌స్తువుల‌ను ఆయా దేశాల్లో అమ్ముకోవ‌డానికి జిన్‌పింగ్ బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌ణాళిక వేశారు.

అలాగే వంద‌ల కోట్ల డాల‌ర్ల‌ను అప్పులుగా ఇస్తూ ఆసియా, ఆఫ్రికా దేశాల‌ను, ఆయా ద్వీప దేశాల్లో డ్రాగ‌న్ కాలుమోపుతోంది. ఆయా దేశాలు తాను చెప్పిన‌ట్టు త‌లాడించేలా జీ జిన్‌పింగ్ చేస్తున్నారు. అదేవిధంగా అమేయ సైనిక శ‌క్తితో చైనా ఏకంగా అమెరికానే స‌వాల్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.