Begin typing your search above and press return to search.

వైద్య‌ శాస్త్రానికి స‌వాల్ విసురుతున్న క‌రోనా: వైర‌స్‌లో కొత్త కోణం వెలుగులోకి

By:  Tupaki Desk   |   28 April 2020 5:40 PM IST
వైద్య‌ శాస్త్రానికి స‌వాల్ విసురుతున్న క‌రోనా: వైర‌స్‌లో కొత్త కోణం వెలుగులోకి
X
క‌రోనా వైర‌స్ విషయంలో కొత్త కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఈ వైర‌స్‌ను ఎదుర్కొనే సమయంలో బాధితులు, వైద్యుల‌కు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ కొత్త కొత్త రూపాల్లో ప్రభావం చూపుతుండ‌డం అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నిన్న క‌రోనా ల‌క్ష‌ణాలు గా మ‌రికొన్నింటిని గుర్తించగా తాజాగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మ‌నిషి ర‌క్తంపై, ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌పై తీవ్రంగా ఉంటుంద‌ని వైద్యులు గుర్తించారు. దీంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న రేపుతోంది. ఈ విష‌యం న్యూయార్క్‌ లో ఓ క‌రోనా బాధితుడి ద్వారా వెలుగులోకి వ‌చ్చింది.

న్యూయార్క్‌ లోని మౌంట్ సినయ్ ఆస్ప‌త్రిలో క‌రోనా వైర‌స్‌పై విస్తృత ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఆ బాధితుల‌కు వైద్య స‌హాయం అందిస్తున్నారు. తాజాగా ఆ ఆస్ప‌త్రి వైద్యులు కరోనా పాజిటివ్ సోకిన రోగి రక్తంలో వింత మార్పులను గుర్తించారు. కరోనా సోకిన రోగుల ఒక్కో శరీర భాగంలో రక్తం చిక్కగా ఉండ‌డం, గడ్డ కట్టడం వంటి ప్రమాదకర లక్షణాలను వైద్యులు గ‌మ‌నించారు. ఇక ఊపిరితిత్తులలోని కొన్ని భాగాల్లో చుక్క ర‌క్తం లేక పోవడాన్ని చూసి ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. రోగి శరీరాన్ని క్షీణించేలా క‌రోనా వైర‌స్ చేస్తోంద‌ని వైద్యులు అధ్య‌య‌నం చేశారు. ఆ విధంగా కావ‌డం వ‌ల‌న శ‌రీరంలోని అన్ని అవయవాలు, భాగాల‌కు రక్త ప్రసరణ నిలిచిపోయి రోగి త్వరగా మృతి చెందే అవ‌కాశం ఉందని గుర్తించారు.

దీంతోపాటు మ‌రో విష‌యాన్ని గుర్తించారు. క‌రోనా బాధితుడి పేషెంట్ల మెదడు భాగంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నట్టు గ‌మ‌నించారు. క‌రోనా బాధితుల్లో కొంద‌రికి బ్రెయిన్ స్ట్రోక్ మొదటి లక్షణంగా బయటపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మౌంట్ సినయ్‌లోని కరోనా సోకిన వారిలో కిడ్నీ డ‌యాలసిస్ పేషెంట్ కూడా ఉన్నారు. అత‌డిలో రక్తం గడ్డకట్టడాన్ని గమనించారు. కొంద‌రి క‌రోనా బాధితుల్లో ఊపిరితిత్తులు రక్తం లేకుండా ఉండటాన్ని గుర్తించారు. ఈ విధంగా క‌రోనా వైర‌స్ మాన‌వ శ‌రీరం పై తీవ్ర ప్ర‌భావం చూపుతుండ‌డం తో వైద్యులు, శాస్త్ర‌వేత్త‌లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ వైర‌స్ ఉనికి, గ‌మ‌నం గుర్తించేందుకు ఇంకా విస్తృత స్థాయి లో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.