Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు కొత్త‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గురించి మీకు తెలియ‌న విష‌యాలు ఇవే!

By:  Tupaki Desk   |   27 Aug 2022 7:45 AM GMT
సుప్రీంకోర్టు కొత్త‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గురించి మీకు తెలియ‌న విష‌యాలు ఇవే!
X
సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్ (యూయూ ల‌లిత్) ప్రమాణస్వీకారం చేశారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత సీజేఐగా ప్రమాణం చేయించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ఆగ‌స్టు 26న పదవీ విరమణ చేసిన సంగ‌తి తెలిసిందే.

దీంతో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స్థానంలో జస్టిస్‌ యు.యు. లలిత్‌ సీజేఐగా బాధ్యతలు తీసుకున్నారు. కాగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా 14 నెల‌లు ప‌ద‌విలో ఉండ‌గా.. జ‌స్టిస్ యు.యు. ల‌లిత్ కేవ‌లం 74 రోజులు మాత్ర‌మే ప‌ద‌విలో ఉంటారు. న‌వంబ‌ర్ 8తో ఆయ‌న‌కు 65 ఏళ్లు పూర్తి కానుండ‌టంతో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్‌ యు.యు. లలిత్ కూడా ఒక‌రు. 1957 నవంబరు 9న మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్ లో ఆయ‌న జ‌న్మించారు.

జూన్‌ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. ఇక ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు అనేక కీలక తీర్పుల‌ను వెలువ‌రించారు.

ట్రిపుల్‌ తలాక్‌ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని.. అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ యు.యు.లలిత్ కూడా ఒక‌రు. అదేవిధంగా కేరళలోని తిరువ‌నంత‌పురంలో ఉన్న శ్రీ అనంత‌ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజ కుటుంబానికి ఉంటుందని కూడా ఆయ‌న నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం వెలువ‌రించింది.

కాగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ యుయు ల‌లిత్ ప్ర‌మాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ, పలువురు కేంద్రమంత్రులు తదితరులు హాజర‌య్యారు.