Begin typing your search above and press return to search.

ఈ ఇద్దరిలో లక్కీ ఎవరో ?

By:  Tupaki Desk   |   5 Sep 2021 12:30 AM GMT
ఈ ఇద్దరిలో లక్కీ ఎవరో ?
X
తొందరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని అధికార వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా రెండున్నరేళ్ళ తర్వాత మళ్ళీ ప్రక్షాళన చేస్తానని అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పనితీరు ఆధారంగా కొందరిని ఉంచి మిగిలిన వాళ్ళందరినీ మార్చేస్తానని జగన్ హింట్ కూడా ఇచ్చారు. ఇపుడా రెండున్నరేళ్ళ గడువు దగ్గర పడుతుండటంతో చాలామంది మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో మంత్రివర్గంలో కంటిన్యు అయ్యేదెవరో ? ఉధ్వాసన ఎవరికో అర్ధంకావటంలేదు.

ఇదే సమయంలో ఇద్దరు ఎంఎల్ఏల మద్దతుదారులు మాత్రం తొందరలో ఏర్పాటయ్యే కొత్త మంత్రివర్గంలో తమ ఎంఎల్ఏలకు బెర్త్ ఖాయమని చెప్పేసుకుంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరయ్యా అంటే భీమవరం, గాజువాక ఎంఎల్ఏలే. మొన్నటి ఎన్నికల్లో పై రెండు నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసందే. పై రెండు నియోజకవర్గాల్లో పవన్ ఏరికోరి పోటీ చేయడానికి కారణం ఏమిటంటే అక్కడ కాపులు ఎక్కువుగా ఉండటమే అనే ప్రచారముంది.

అయితే ఆశ్చర్యంగా రెండో చోట్లా పవన్ ఓడిపోయారు. భీమవరంలో పవన్ పై గ్రంధి శ్రీనివాస్ పోటీచేసి సుమారు 3900 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలాగే గాజువాకలో పవన్ పై పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి సుమారు 4 వేల ఓట్లతో గెలిచారు. రెండు చోట్లా టైట్ ఫైట్ జరిగినా చివరకు రెండోచోట్లా పవన్ ఓడిపోయారు. దాంతో ఇద్దరికీ జెయింట్ కిల్లర్స్ అని పేరు పడింది. అప్పట్లో పవన్ ను ఓడించారన్న పేరు ఇపుడు మంత్రివర్గంలో బెర్తుకు మార్గం సుగమం చేస్తోందనే ప్రచారం మొదలైంది.

ఈ ఇద్దరిలో కూడా గ్రంధి శ్రీనివాస్ అయితే మంత్రివర్గంపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే భీమవరంలో పవన్ను ఓడించటం అంత తేలిక కాదంటున్నారు. ఎందుకంటే పవన్ ది కూడా పశ్చిమగోదావరి జిల్లాయే. జిల్లాలో కాపుల మెజారిటియే ఎక్కువ ఉంది. కాకపోతే ఇటు పవన్ అటు గ్రంధి ఇద్దరు కాపులే కావటంతో కాపుల ఓట్లు చీలిపోయాయి. దానికి తోడు క్షత్రియుల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పండింది. అలాగే బీసీల ఓట్లు కూడా గ్రంధికి బాగా కలిసొచ్చింది. దాంతో పవన్ పై గ్రంధి గెలుపు సాధ్యమైంది.

పై ఇద్దరు ఎంఎల్ఏలు పవన్ పై గెలవడంతో తొందరలో తమకు అమాత్య యోగం ఖాయమని ఎవరికి వారే మంచి జోష్ మీదున్నారు. మంత్రులుగా తొలగించే వారిని ఏ ప్రాతిపదికగా తొలగిస్తారో ? తీసుకునే వాళ్ళను ఏ ప్రాతిపదికన తీసుకుంటారో అనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి పై ఇద్దరు ఎంఎల్ఏలు మాత్రం మంచి ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇద్దరిలో లక్కీ ఎవరో చూడాలి మరి.