Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌కు అక్క‌డా మూడో స్థాన‌మేనా..!

By:  Tupaki Desk   |   18 Dec 2021 9:01 AM GMT
కాంగ్రెస్‌కు అక్క‌డా మూడో స్థాన‌మేనా..!
X
తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ఏ ఎన్నిక‌లు జ‌రిగినా క‌లిసొచ్చేలా క‌నిపించ‌డం లేదు. దుబ్బాక‌.. నాగార్జున సాగ‌ర్‌.. హుజూరాబాద్‌.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. ఇలా ఏవి తీసుకున్నా మూడో స్థానంతోనే స‌రిపెట్టుకుంటోంది. ఒక్క నాగార్జున సాగ‌ర్ మిన‌హా.. కాంగ్రెస్ స్థానాన్ని క్రమంగా బీజేపీ ద‌క్కించుకుంటోంది. ఇప్పుడు మ‌రో ఎన్నిక ఫ‌లితం కూడా ఇలాగే వ‌చ్చింది.

ప‌టాన్‌చెరు పారిశ్రామిక వాడ‌లోని పెన్నార్ భారీ ప‌రిశ్ర‌మ‌లో శుక్ర‌వారం యూనియ‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఘ‌న విజ‌యం సాధించారు. ఇక్క‌డ టీఆర్ఎస్ కి గ‌ట్టి పోటీ ఇచ్చింది సీఐటీయూ అభ్య‌ర్థి.

రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్‌ను మూడో స్థానానికి తోసేశారు. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల‌పై పారిశ్రామిక వాడ‌లో తీవ్ర ఉత్కంఠత‌ నెల‌కొంది. ఓట్ల లెక్కింపు త‌ర్వాత టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యంతో పారిశ్రామిక ప్రాంగ‌ణం గులాబీ మ‌య‌మైంది.

ఈ ఎన్నిక‌లో టీఆర్ఎస్ కార్మిక విభాగం త‌ర‌పున యూనియ‌న్ అధ్య‌క్ష బ‌రిలో రాంబాబుయాద‌వ్ నిలిచారు. ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్‌రెడ్డి త‌న అభ్య‌ర్థిని గెలిపించుకోవ‌డానికి తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు.

రాంబాబుయాద‌వ్ త‌ర‌పున అన్నీ తానై నిలిచి కార్మికుల‌ను ఏకం చేయడంలో విజ‌యం సాధించారు. సీఐటీయూ అభ్య‌ర్థి చుక్కా రాములుపై 148 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

పెన్నార్ ప‌రిశ్ర‌మలో మొత్తం 580 ఓట్లు ఉండ‌గా.. టీఆర్ఎస్ కార్మిక విభాగం త‌ర‌పున పోటీ చేసిన రాంబాబుయాద‌వ్‌కు 332 ఓట్లు వ‌చ్చాయి. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి సీఐటీయూ అభ్య‌ర్థి చుక్కా రాములుకు 184 ఓట్లు ల‌భించాయి.

కాంగ్రెస్ మాత్రం దారుణ‌మైన ఫ‌లితాన్ని మూట‌గ‌ట్టుకుంది. తొలిసారి పెన్నార్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఐఎన్‌టీయూసీ అభ్య‌ర్థి.. కాంగ్రెస్ ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి కాట శ్రీ‌నివాస్‌గౌడ్ కు కేవ‌లం 63 ఓట్లు ల‌భించాయి.

ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో కాంగ్రెస్ శ్రేణులు కంగుతిన్నాయి. ఇక్క‌డ కూడా త‌మకు మూడో స్థానమేనా అని ఆందోళ‌న చెందుతున్నాయి. త‌మ పార్టీ అభ్య‌ర్థి శ్రీ‌నివాస్‌గౌడ్ కు వ్య‌క్తిగ‌తంగా మంచి పేరు ఉన్నా ఇలాంటి ఫ‌లితాలు రావ‌డం ఏమిట‌ని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ప‌టాన్‌చెరు నుంచి పోటీచేసిన శ్రీ‌నివాస్‌గౌడ్ మంచి ఫ‌లితాల‌నే సాధించారు. ఓడిపోయినా 78 వేల పైచిలుకు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ పెన్నార్‌ ఫ‌లితాల‌తో పార్టీ భ‌విష్య‌త్ పై మ‌రోసారి నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.