Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ కన్ఫామ్.. ఎస్బీఐ రిపోర్టు.. ఎప్పట్నుంచి అంటే..?

By:  Tupaki Desk   |   5 July 2021 5:30 PM GMT
థర్డ్ వేవ్ కన్ఫామ్.. ఎస్బీఐ రిపోర్టు.. ఎప్పట్నుంచి అంటే..?
X
క‌రోనా సెకండ్ వేవ్ దేశంపై ఏ స్థాయిలో ప్ర‌భావం చూపిందో తెలిసిందే. నిత్యం 4 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. రోజూవారి మ‌ర‌ణాలు కూడా 4 వేలు దాటిపోయాయి. భార‌త్ లో క‌రోనా తీవ్ర‌త‌ను చూసి ప్ర‌పంచ దేశాల‌న్నీ చ‌లించిపోయాయి. సెకండ్ వేవ్ దెబ్బ‌కు దేశం అన్నివిధాలుగా న‌ష్ట‌పోయింది. ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోగా.. ఆర్థికంగా చితికిపోయారు. ఎంతోమంది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వ‌చ్చింది. ఇంత‌టి భ‌యోత్పాతాన్ని సృష్టించిన క‌రోనా మ‌హ‌మ్మారి.. ఇప్పుడిప్పుడే అదుపులోకి వ‌స్తోంది. ఇంకా ప‌లు రాష్ట్రాల్లో కేసులున‌మోదు అవుతున్న‌ప్ప‌టికీ.. తీవ్ర‌త మాత్రం చాలా వ‌ర‌కు త‌గ్గింది. ప్ర‌స్తుతం దేశంలో రోజూవారి కేసుల సంఖ్య 40 వేల ద‌గ్గ‌ర న‌మోద‌వుతోంది.

అయితే.. ప్ర‌మాదం ఇంత‌టి తొల‌గిపోలేద. థ‌ర్డ్ వేవ్ ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన వ్యాఖ్యానాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌ద‌ని చెబుతుంటే.. మ‌రికొంద‌రు గ‌ట్టి ఎఫెక్టే ఉంటుంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు థ‌ర్డ్ వేవ్ రానేరాదు అంటుంటే.. కొంద‌రు మాత్రం వ‌చ్చి తీరుతుంద‌ని అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. థ‌ర్డ్ వేవ్ పై ఎస్‌బీఐ నిర్వ‌హించిన స‌ర్వే కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డిస్తోంది.

జూలై సెకండ్ వీక్ నుంచి క‌రోనా థ‌ర్డ్ వేవ్ పెరిగే ఛాన్స్ ఉంద‌ని ఎస్‌బీఐ స‌ర్వే నివేదిక వెల్ల‌డించింది. ఇది ఆగ‌స్టు నాటికి వేగం పుంజుకుంటుంద‌ని, ఆగ‌స్టు 12 త‌రువాత కేసుల సంఖ్య‌లో మ‌రింత వేగం పెరుగుతుంద‌ని తెలిపింది. ఆ నెల పూర్త‌యిన త‌ర్వాత సెప్టెంబ‌ర్ నాటికి గ‌రిష్ఠ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ రిపోర్టు వెల్ల‌డించింది.

ఇదిలాఉంటే.. ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకున్న‌ప్పుడు థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు ఉధృతి రేటు 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. భార‌త దేశానికి వ‌చ్చే స‌రికి ఇది మ‌రింత పెరుగుతుంద‌ని, అక్టోబ‌ర్ - న‌వంబ‌ర్ నెల‌ల్లో పీక్ స్టేజ్ కు చేరుకుంటుంద‌ని ప్ర‌భుత్వ ప్యానెల్ శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. సెకండ్ వేవ్ తో పోలిస్తే రోజూవారి గ‌రిష్ట కేసులు స‌గం త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేశారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుంటే.. ప‌రిస్థితి మ‌రింత ఉధృతం కావొచ్చ‌ని చెప్పారు. ఇప్పుడు ఎస్బీఐ నివేదిక కూడా ఇదేవిధ‌మైన అంచ‌నా వేయ‌డంతో.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం అనివార్య‌మ‌ని అంటున్నారు.