Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ తో క‌రోనా ఖ‌త‌మైన‌ట్టేన‌ట‌!

By:  Tupaki Desk   |   23 Jun 2021 2:30 AM GMT
సెకండ్ వేవ్ తో క‌రోనా ఖ‌త‌మైన‌ట్టేన‌ట‌!
X
ఆహా.. ప‌ల‌క‌డానికీ, విన‌డానికీ ఈ మాట‌ ఎంత హాయిగా ఉందో క‌దా..! ఇది.. నిజ‌మైతే ఎంత బాగుంటుందో మాట‌ల్లో చెప్ప‌లేం. థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం ముందుంద‌ని నిపుణులు, కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్న వేళ‌.. ఈ మాట ఎంతో ఊర‌ట‌నిస్తోంది. మ‌రి, ఈ మాట‌లు ఎవ‌ర‌న్నారు? ఏ ఆధారంతో అన్నారు? అందులో నిజం ఎంత అన్న‌ది చూద్దాం.

క‌ర్నాట‌క‌లోని ఇద్ద‌రు వైరాల‌జిస్టులు వేర్వేరు సంద‌ర్భాల్లో ఈ మాట‌లు అన్నారు. వారిలో ఒక‌రి పేరు విజ‌య‌. ఈమె రిటైర్డ్ మైక్రోబ‌యాల‌జీ ప్రొఫెస‌ర్‌. ఈమె అంచ‌నా ప్ర‌కారం.. థ‌ర్డ్ వేవ్ అనేది ఒక ఊహ మాత్ర‌మే. దీనికి ఎలాంటి ఆధార‌మూ లేదు అంటున్నారు విజ‌య‌. అయితే.. అజాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తాను చెప్ప‌ట్లేద‌న్న ఆమె.. థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని ఎలా చెబుతున్నారని మాత్ర‌మే ప్ర‌శ్నిస్తున్న‌ట్టు చెప్పారు. దీనికి రిఫ‌ర‌ల్ సోర్స్ ఏమీ లేద‌ని అంటున్నారు.

ఇక‌, మ‌రో వైరాల‌జిస్టు పేరు జాక‌బ్ జాన్‌. ఈయ‌న కూడ‌కా క‌న్న‌డిగుడే. ఈయ‌నే ఓ అడుగు ముందుకు వేసి.. అస‌లు థ‌ర్డ్ వేవ్ అనేది లేనే లేద‌ని అంటున్నారు. ఈ నెలాఖ‌రుతో సెకండ్ వేవ్ ముగుస్తుంద‌ని, ఆ త‌ర్వాత ఈ సంవ‌త్స‌రం ముగిసే నాటికి క‌రోనా పూర్తిగా అంత‌మై పోతుంద‌ని కూడా ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు.

సాక్షాత్తూ ఎయిమ్స్ డైరెక్ట‌ర్ వంటి వాళ్లు, ఎంతో మంది నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. థ‌ర్డ్ వేవ్ అనేది వ‌స్తుంద‌ని, అది కూడా పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని భ‌య‌పెడుతున్నారు కూడా. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. థ‌ర్డ్ వేవ్ అనేది ఎప్పుడు వ‌స్తుందో? ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో అనే ఆందోళ‌న‌లు దేశ‌వ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో.. ఈ ఇద్ద‌రు సానుకూల వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.