Begin typing your search above and press return to search.

పదమూడేళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ...?

By:  Tupaki Desk   |   5 May 2022 5:13 AM GMT
పదమూడేళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ...?
X
ఆయన సీనియర్ మోస్ట్ మంత్రి. అయితే ఎన్ని సార్లు మంత్రిగా ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు ఆ కుర్చీలో కొలువు తీరాలో వివరాలు గబుక్కున చెప్పమంటే తలపండిన రాజకీయ విశ్లేషకులకే తెలియదు. ఇక రాజకీయం పట్ల అభిలాష ఉన్న వారికీ అసలు తెలియదు. అందుకే బొత్స సత్యనారాయణ తాను పదమూడేళ్ళ ఇండస్ట్రీ అంటున్నారు. అంటే అన్నేళ్ళుగా మంత్రి కుర్చీలో కూర్చున్నారుట.

మరో రెండేళ్ళు గ్యారంటీగా మంత్రిగా ఉంటారు. సో అలా చూసుకుంటే పదిహేనేళ్ల మంత్రి అన్న మాట. ఒక విధంగా చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయితే బొత్స వారు కూడా 15 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సరే ఇండస్ట్రీలు, అనుభవాలు అన్నీ కూడా దేనికి అని ఒక ప్రశ్న పుట్టవచ్చు.

ఇంతటి విశేష అనుభవం కలిగిన బొత్స విద్యా శాఖ మంత్రిగా ఉన్నారూ అంటే పరీక్షల నిర్వహణ విషయంలో ఎవరైనా బేఫికర్ గా ఉండాలి. కానీ అలా జరగడంలేదే. టెన్త్ పరీక్షలు మొదలవుతూనే లీకుల గోల మొదలైంది. ఒక్క రోజు కాదు వరసబెట్టి ప్రతీ రోజూ. ఇలా పేపర్స్ లీక్ అన్న వార్తలు వస్తే సహజంగా విద్యార్ధులు బెంబేలెత్తుతారు కదా.

అందుకే విపక్షాలు కూడా గట్టిగానే నిలదీస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా చంద్రబాబు కూడా శ్రీకాకుళం టూర్ లో పేపర్ల లీక్స్ కి ఎవరు బాధ్యత వహిస్తారు, బొత్స రాజీనామా చేస్తారా, లేక జగన్ చేస్తారా అంటూ గట్టిగానే నిలదీశారు. అయితే తాను మంత్రి కుర్చీకి కొత్త కాదు, పదవులకూ కొత్త కాదు అని బొత్స చెప్పుకుంటున్నారు.

ఇక ఒక ప్రశ్నపత్రం కూడా లీక్ కాలేదని, మాస్ కాపీయింగ్ అన్న మాటే ఎక్కడా లేదని బొత్స చెప్పడమూ విశేషం. ఒక వైపు పేపర్స్ లీక్ అయ్యాయని వార్తలు వచ్చాయి. బాధ్యులను అరెస్ట్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ బొత్స మాత్రం అలాంటిదేమీ లేదని, ఇదంతా విపక్ష రాజకీయం అంటున్నారు.

రాజకీయం అయితే అవవచ్చు కాక కానీ పరీక్షల్ పేపర్స్ లీక్ కాలేదు అంటే మాత్రం తప్పున్నరే. ఎందుకంటే తొలి మూడు రోజులూ లీక్ అయ్యాయి. అయితే పరీక్ష మొదలైన తరువాత లీక్ అయ్యాయని చెప్పుకున్నా కూడా నో యూజ్. ఎందుకు అసలు లీక్ కావాలన్నదే ఇక్కడ ప్రశ్న,.

ఇక దీనికి ముందు ఎనిమిది, తొమ్మిది తరగతి ప్రశ్న పత్రాలు కూడా ముందు రోజు వాట్సప్ లో లీక్ అయిపోయాయి. దాని మీద కూడా బొత్స ఎందుకు మాట్లాడడంలేదు అన్నదే ప్రశ్న. ఎనిమిది తొమ్మిది చిన్న పరీక్షలు అని లైట్ తీసుకున్నారేమో. ఏది ఏమైనా పరీక్షల లీక్స్ మీద జనాల్లో అయితే వంద డౌట్లూ వేయి సందేహాలు ఉన్నాయి.

ఈ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో బాధ్యత గల మంత్రి చూడాలి, కనిపెట్టి పనిపట్టాలి, విపక్షాల మీద ఎదురు విమర్శలు చేయడం మంచిది కాదేమో. ఇక ఒక్క పరీక్షల్తో టెన్త్ పూర్తి అవుతుంది. రానున్నది ఇంటర్ పరీక్షల కాలం. మరి ఆ విషయంలో అయినా గట్టి చర్యలు చేపట్టాలి. పకడ్బంధీగా పరీక్షలు జరిగేలా చూసుకోవాలి.

ఇకపోతే పరీక్షల అంశం సున్నితం, విద్యార్ధుల జీవితాలతో ముడిపడి ఉంది, అలాగని కళ్ల ముందు జరిగిన దాన్ని విపక్షాలు చెప్పకూడదు అంటే కూడా తప్పే కదా. ఏది ఏమైనా పెద్ద మాస్టార్ గా బొత్సా సార్ బెత్తం పట్టుకుంటే తప్ప పరీక్షల నిర్వహణ అన్నది గాడిన పడదు.

ఇక తాము మంత్రిగా చాలా ఏళ్ళు చేశాను, ఇదేమైన మహా భాగ్యమా అనడంలో బొత్స మనసు విద్యా శాఖ మీద అంతగా లేదా అన్న సందేహాలూ వస్తున్నాయి. ఆ విషయాలను కూడా ఈ కీలకమైన సమయాన పక్కన పెట్టి విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే ఆయనకూ, ఆయన పదవికీ కూడా పేరు అన్నది గుర్తెరగాలి.