Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై ఆ సామాజికవర్గం గుస్సా

By:  Tupaki Desk   |   3 March 2019 11:12 AM GMT
చంద్రబాబుపై ఆ సామాజికవర్గం గుస్సా
X
సుదీర్ఘమైన తీరప్రాంతమే ఆంధ్రప్రదేశ్‌ కు అతి పెద్ద వనరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఆయన రాష్ట్రం కోసం ఎలా వాడుకున్నారో తెలియదు కానీ రాజకీయంగా మాత్రం తెలుగుదేశం పార్టీ ఈ సుదీర్ఘ తీర ప్రాంతం చాలాకాలంగా ఉపయోగపడుతూ వస్తోంది. ఎన్టీఆర్ కాలం నుంచి ఏపీలోని మత్స్యకారులు టీడీపీకి గంపగుత్తగా ఓట్లేసేవారు. ఆ పార్టీని అంతగా నమ్మిన మత్స్యకారులను చంద్రబాబు నాయుడు దారుణంగా వంచించారని ఇప్పుడు వారు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయరాదని మత్స్యకార గ్రామాల్లో కట్టుబాట్లు విధించుకుంటున్నారట.

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబులపై ఇంతగా ఆగ్రహించడానికి వారు కారణాలు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన రెండు ప్రధాన హామీలను చంద్రబాబు విస్మరించారని.. అయిదేళ్లపాటు ఎదురుచూసి విసిగిపోయామని, తాజాగా కూడా మోసపోయామని వారంటున్నారు. గత ఎన్నికల సమయంలలో చంద్రబాబు మత్స్యకారులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి వారిని ఎస్టీల్లో చేర్చడమైతే.. రెండోది ఆ సామాజికవర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం. కానీ, ఈ రెండింటి విషయంలోనూ చంద్రబాబు తమను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు.

ఎస్టీల్లో చేరుస్తామన్న హామీ నెరవేర్చకపోవడం ఒకెత్తయితే కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకపోవడంతో మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేల కోటా, గవర్నరుకోటాలో ఆరుగురిని ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అందులో ఒక్కరు కూడా మత్స్యకారులు లేరు. దీంతో ఆయన తన హామీని పూర్తిగా గాలికి వదిలేశారని తేలిపోయిందంటున్నారు మత్స్యకారులు. ఇంతకాలం నమ్ముకున్న పార్టీ నట్టేట ముంచుతుంటే ఇంకా ఎంతకాలం పట్టుకుని వేలాడుతామంటూ ఏపీలోని తీర ప్రాంతంలోని 9 జిల్లాల్లో ఉన్న మత్స్యాకారులతో పాటు రాయలసీమలో కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ సామాజికవర్గం వారు కూడా టీడీపీపై మండిపడుతున్నారట.