Begin typing your search above and press return to search.

ఏపీ విద్యార్థులకు ఇదో కొత్త బాధ!

By:  Tupaki Desk   |   15 Nov 2022 9:34 AM GMT
ఏపీ విద్యార్థులకు ఇదో కొత్త బాధ!
X
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యా రంగంలో విభిన్న సంస్కరణలను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ ఎడ్యుటెక్‌ కంపెనీ బైజూస్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది నుంచి 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌ అందిస్తోంది.

అయితే ఇది మొక్కుబడి తంతుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.స్మార్ట్‌ ఫోన్‌లో లేదా ట్యాబ్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు వినియోగిస్తున్నారా? వారికి సందేహాలు వస్తే ఎవర్ని సంప్రదించాలి? ఒకవేళ స్మార్ట్‌ ఫోన్‌ లేకపోతే వారికి కంటెంట్‌ అందించడం ఎలా అనే దానిపై స్పష్టత లేదని అంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు, ఆ తరగతికి బోధించే ఉపాధ్యాయులకు మాత్రమే ట్యాబ్‌లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా తరగతుల విద్యార్థులు వారి సొంత స్మార్ట్‌ఫోన్లలోనే బైజూస్‌ కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఉన్న వారికి డౌన్‌లోడ్‌ చేసి ఇవ్వడం ఇప్పటికే పూర్తికాగా.. మరికొన్నిచోట్ల ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. అయితే ప్రధానంగా విద్యార్థుల ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసిన కంటెంట్‌ను పిల్లలు వాడుతున్నారా? లేదా? అని పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక విభాగం లేదని అంటున్నారు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టు ఫోన్లలో కంటెంట్‌ వేసి ఇచ్చేశాం.. ఇక మీ బాధ మీరు పడండి అన్నట్లుగా పరిస్థితి తయారైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బైజూస్‌ కంటెంట్‌పైన విద్యార్థులకు సందేహాలు ఏమైనా తలెత్తితే తీర్చేవారు లేకపోవడం ఇందులో ప్రధాన లోపమని అంటున్నారు. మరోవైపు స్మార్ట్‌ ఫోన్లు విద్యార్థుల తల్లిదండ్రుల వద్దే ఉంటాయి. వాటిని స్కూల్‌కు తేవడం కుదరదు.

మరోవైపు స్మార్ట్‌ పోన్లు కూడా అందరికీ లేవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఈ సమస్య బాగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలే ఎక్కువ. వీరిలో అందరికీ స్మార్ట్‌ పోన్‌ లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 30% మందికి పైగా స్మార్ట్‌ ఫోన్లు లేవని చెబుతున్నారు.

ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో పాఠశాలలు మూతపడినప్పుడు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినప్పుడు విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడం, ఉన్నా ఇంటర్‌నెట్‌ సదుపాయం లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్స్‌ సమస్యలు ఇలా ఎన్నో వెలుగుచూసిన సంగతి తెలిసిందే.

ఈ ఇబ్బందులన్నీ ప్రభుత్వానికి తెలిసినా ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ను సొంత స్మార్ట్‌ ఫోన్లలో వేసుకోవాలని సూచించడంపై విమర్శలు రేగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఫోన్‌ నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లలోని ఫోన్‌ నంబర్లు ఎంటర్‌ చేస్తున్నారు. మరికొన్నిచోట్ల స్మార్ట్‌ఫోన్లు లేకపోతే విద్యార్థుల బంధువుల నంబర్లు నమోదు చేశారు. దీంతో అసలు ఎంతమంది విద్యార్థలకు స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయో కచ్చితంగా తెలియని దుస్థితి నెలకొంది.క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలున్నా బైజూస్‌ను అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తుండటంపై విమర్శలు రేగుతున్నాయి. మరోవైపు ఫోన్‌ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోతేనేమో ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఇక బైజూస్‌ కంటెంట్‌ అంతా వీడియోల రూపంలో ఉందని అంటున్నారు. అంతేకాకుండా మొత్తం ఇంగ్లిస్‌లోనే ఉండటంతో ఉపాధ్యాయులే అర్థం చేసుకోలేక పోతున్నారని అంటున్నారు.

అదేవిధంగా తమకు ఇచ్చిన పరికరాల (టీఎల్‌ఎం)తో తరగతి గదిలో బోధించేందుకు ఉపాధ్యాయులకు ఏడాదికి రూ.500 మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. ఇది ఏ మాత్రం సరిపోదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.