Begin typing your search above and press return to search.

ఇదీ.. బసవరాజు బొమ్మై బ్యాక్ గ్రౌండ్

By:  Tupaki Desk   |   28 July 2021 5:45 AM GMT
ఇదీ.. బసవరాజు బొమ్మై బ్యాక్ గ్రౌండ్
X
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను ఎంపిక చేస్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లు చెప్పినా.. అదంతా బీజేపీ అధినాయకత్వం అనుకున్నట్లే జరిగిన విషయం తెలిసిందే. పలువురు నేతలు ఈ పదవి కోసం పోటీ పడినా.. బసవరాజును ఏరి కోరి మరీ ఎంపిక చేసినట్లు చెబుతారు. యడ్యూరప్ప ప్రభుత్వంలో హోం మంత్రిగా వ్యవహరించిన ఆయన..మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మూ కొడుకుగా అందరికి సుపరిచితుడు. పదవీకాలం పూర్తి కాక ముందే.. అధిష్ఠానం కోరినట్లే తన పదవికి రాజీనామా చేసిన యడ్డీకి కూడా బసవరాజు చాలా సన్నిహితుడు కావటం గమనార్హం. దీంతో అధికార బదిలీ చాలా సులువుగా సాగినట్లుగా చెప్పాలి. దీనికి తోడు.. కర్ణాటకలో రాజకీయ.. సామాజిక ప్రాబల్యం ఉన్న లింగాయత్ వర్గానికే ఈసారీ సీఎం పదవి దక్కింది.

ఇక.. బసవరాజు బ్యాక్ గ్రౌండ్ విషయానికివస్తే.. ఆసక్తికర అంశాలెన్నో. యూత్ లీడర్ గా మొదలైన అతడి రాజకీయ ప్రస్థానం ఎట్టకేలకు సీఎం కుర్చీ వరకు వచ్చింది. 1960లో హుబ్లీలో పుట్టిన బసవరాజ్ బొమ్మై.. అదే ఊళ్లోని బీవీ భూమారెడ్డి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. చదువు తర్వాత టాటా మోటార్స్ గ్రూపులో ఇంజినీర్ గా పని చేశారు.

రాజకీయాల విషయానికి వస్తే జేడీయూ ననుంచి యువజన సభ్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన.. అంతకంతకూ ఎదుగుతూ 1996లో అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి జేహెచ్ పటేల్ కు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సుదీర్ఘ కాలం పాటు జేడీయూలో ఉన్న ఆయన 2008లో బీజేపీలో చేరారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా వ్యవహరించిన ఆయన తొలిసారి 2008-13 మధ్యన మంత్రిగా వ్యవహరించారు. తాజాగా యడ్డీ సర్కారులో హోం మంత్రిగా పని చేశారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం.. వరదల్ని నియంత్రించే విషయంలో ప్రభుత్వ వైఫల్యం.. పార్టీని బలోపేతం చేయటం లాంటి అడ్డంకులు ఆయనకు ఉన్నట్లు చెబుతారు. ముఖ్యమంత్రి పదవికి బసరాజు పేరును యడ్డీ స్వయంగా ప్రతిపాదిస్తే.. మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద కారజోళ బలపర్చారు. తన పేరును సీఎం పదవికి ప్రతిపాదించినంతనే.. ఆయన లేచి వెళ్లి యడ్డీ కాళ్లకు నమస్కారం చేశారు.

బసవరాజు తండ్రి ఎస్ ఆర్ బొమ్మూ 32 ఏళ్ల క్రితం కర్నాటక సీఎంగా వ్యవహరించారు. మళ్లీ ఇన్నాళ్లకు కొడుకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. సుదీర్ఘ కాలం పాటు జనతాదళ్ (యూ)లో ఉన్న బసవరాజు 2008లో బీజేపీలో చేరే సమయంలో 22 మందితో కలిసి పార్టీలో చేరారు. బసవరాజ్ పేరులోని బసవ అనే పదం 12వ శతాబ్దంలో స్థాపించిన బసవేశ్వరుడిని సూచిస్తుందని చెబుతారు.

బసవరాజ్ ను ఎంపిక చేయటంలో బీజేపీ అధినాయకత్వం పక్కా వ్యూహాన్ని అమలు చేసినట్లు చెబుతారు. పార్టీకి సంప్రదాయక ఓటు బ్యాంక్ గా నిలిచే లింగాయత్ ల మనసుల్ని దోచుకోవటమే కాదు.. అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి ఎక్కువ సీట్లు అందించిన ఉత్తర కర్ణాటకకు చెందిన వ్యక్తినే ఎంపిక చేయటం గమనార్హం. అనూహ్యంగా బీజేపీ ముఖ్యమంత్రుల ఎంపికలో కీలకభూమిక పోషించే ఒక సంప్రదాయాన్ని మాత్రంపక్కన పెట్టింది.

అదేమంటే.. ముఖ్యమంత్రిగా వ్యవహరించే బీజేపీ నేత ఎవరైనా సరే సంఘ్ పరివార్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. కానీ.. బసవరాజ్ విషయంలో మాత్రం అందుకు మినహాయింపు ఇచ్చారు. దేశంలో మరే బీజేపీ ముఖ్యమంత్రికి లేనట్లుగా బసవరాజ్ కు ప్రత్యేక ప్రివిలైజ్ ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలన్న షరతుతో చూస్తే.. మిగిలిన (లింగాయత్ వర్గం.. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నేత) వాటిలోతేడా వచ్చే వీలుంది. అందుకే..తమ రూల్ ను మోడీషాలు కాస్త మినహాయింపు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.