Begin typing your search above and press return to search.

ఇది బీజేపీ పవరంటే

By:  Tupaki Desk   |   7 Sep 2022 5:21 AM GMT
ఇది బీజేపీ పవరంటే
X
రాష్ట్రంలో బీజేపీకి ఒక్కరంటే ఒక్క ఎంఎల్ఏ కూడా లేరు. ఒక్క ఎంఎల్ఏ కూడా లేరు కాబట్టి అసలు ఎంపీ గురించి ఆలోచనే అవసరం లేదు. పోనీ ఓట్లయినా ఉన్నాయా అంటే అవీ లేవు. ఇటు ఓట్లూ లేక అసలు సీట్లూ లేకపోయినా రెండు ప్రధానమైన పార్టీలను ఒక ఆట ఆడుకుంటోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ ఎంతసేపు తమలో తాము గొడవలు పడుతున్నాయేకానీ ఏ రోజు కూడా బీజేపీ జోలికెళ్ళటంలేదు.

బీజేపీ నేతలపై ఆరోపణలు కాదు కదా చివరకు విమర్శలు చేయటానికి కూడా రెండు పార్టీల నేతలు వెనకాడుతున్నారు. అలాంటిది ఇపుడు ఈ రెండు పార్టీల నేతలు ఢిల్లీలో బీజేపీ నేత ఇంట్లో జరిగిన ఒక పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

బీజేపీ తరపున రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోదర్ పనిచేస్తున్నారు. రెగ్యులర్ గా ఈయన రాష్ట్రంలో పర్యటిస్తూ వైసీపీతో పాటు టీడీపీని కూడా నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటారు. పనిలో పనిగా రెండు పార్టీలపైనా ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఇలాంటి నేతింట్లో ఢిల్లీ వినాయకచవితి పూజ జరిగింది. ఆ పూజకు వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున విజయవాడ లోక్ సభ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఫొటోలో వీళ్ళద్దరే కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరే పాల్గొన్నారని అనుకుంటున్నారు.

వీళ్ళు హాజరవ్వటానికి ముందు, తర్వాత లేదా వీళ్ళతో పాటే ఇంకెంతమంది నేతలు పాల్గొన్నారో సమాచారం లేదు. నిజానికి పూజా కార్యక్రమాలకు రాజకీయాలకు లింకుపెట్టడం ఉద్దేశ్యం కాదు.

ఏ పార్టీ నేతింట్లో అయినా ఏదైనా కార్యక్రమం జరిగితే మిగిలిన పార్టీల నేతలు వెళ్ళటం చాలా సహజమే. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే సునీల్ కు అసలు ఏపీతో ఇన్చార్జి హోదా తప్ప ఇంకెలాంటి సంబంధం లేదు. పైగా సునీలేమన్నా బీజేపీలో అగ్రనేతా అంటే అదీకాదు. అయినా సరే ఆయన పూజకు పిలవటం, రెండు పార్టీల ఎంపీలు వెళ్ళటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఏకైక కారణంతోనే బీజేపీ అందరినీ ఇలాగ ఆడిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.