Begin typing your search above and press return to search.

డెల్టా ప్లస్ ఎంత డేంజరో ఈ ఒక్క ఉదాహరణ చాలు.. చెప్పిందెవరంటే?

By:  Tupaki Desk   |   25 Jun 2021 8:30 AM GMT
డెల్టా ప్లస్ ఎంత డేంజరో ఈ ఒక్క ఉదాహరణ చాలు.. చెప్పిందెవరంటే?
X
భారత్ లో సెకండ్ వేవ్ తీవ్రతకు కారణం డెల్టా వేరియంట్ అన్న విషయం తెలిసిందే. దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ మాయదారి వేరియంట్ తీవ్రత గడిచిన కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. హమ్మయ్య అనుకుంటున్న వేళ.. మరో పిడుగు ప్రపంచ ప్రజల నెత్తిన పడింది. ఇప్పటికే ఆగమాగం చేసిన డెల్టా వేరియంట్ మరిన్ని మార్పులకు గురై.. డెల్టా ప్లస్ గా అవతరించింది. దీని తీవ్రత గురించి నిపుణులు.. వైద్య రంగ ప్రముఖులు చేస్తున్న హెచ్చరికలు దడ పుట్టించేలా మారాయి. ప్రపంచంలోని 85 దేశాల్లో డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు మన దేశంలో 40 వరకు కేసులు నమోదు కాగా.. అవన్నీ మహారాష్ట్ర.. కేరళ.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో తమిళనాడు, కర్ణాటక.. జమ్ముకశ్మీర్ లోనూ కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. డెల్టాప్లస్ సోకినట్లుగా గుర్తించిన మధ్యప్రదేశ్ కు చెందిన మహిళ ఒకరు తాజాగా మరణించారు. అదే సమయంలో బాధిత మహిళ వ్యాక్సిన్ తీసుకోకపోవటంతో తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ మాయదారి వేరియంట్ తో వచ్చిన ఇబ్బంది.. ఇది సులువుగా వ్యాపించటంతో పాటు.. రోగ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇదెంత ప్రమాదకరమైన వేరియంట్ అన్న దానికి ఉదాహరణగా.. మాస్కు పెట్టుకోని వారు.. డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడిన వారి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లినా.. వారిని పట్టేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్న మాట చెబుతున్నారు. ఈ మాట చెప్పింది సాదాసీదా వ్యక్తి కాదు. ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో డెల్టా ప్లస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఈ వేరియంట్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. మాస్కులు.. శానిటైజేషన్.. భౌతికదూరం వంటి ప్రాథమిక విషయాల్లో తీసుకునే జాగ్రత్తలే.. డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి రక్షణ పొందేలా చేస్తాయని చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఔషధాన్ని తట్టుకుంటుందని.. రోగ నిరోదక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్న అంచనాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.