Begin typing your search above and press return to search.

రీల్ కథ కాదు రియల్.. తల్లి స్వీపర్..కొడుకు ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   7 April 2022 4:35 AM GMT
రీల్ కథ కాదు రియల్.. తల్లి స్వీపర్..కొడుకు ఎమ్మెల్యే
X
నిద్ర లేచింది మొదలు చెవుల్లో నుంచి రక్తం వచ్చేలా ఆదర్శల మోత మోగించే రాజకీయ నేతలు వేలాది మంది ఉంటారు. మాటల్లో హడావుడి తప్పించి చేతల్లో కనిపించేటోళ్లు చాలా తక్కువ మందే కనిపిస్తారు. వార్డు మెంబరు అయితేనే అధ్యక్ష భవనంలో ఉన్నట్లుగా బిల్డప్ లు ఇచ్చే వారికి మన దగ్గర కొదవ లేదు. అలాంటిది ఇప్పుడు చెప్పే కథనంలోని కాంబినేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో భూతద్దం వేసినా కనిపించదు. రాజకీయమా.. పుచ్చిపోయింది.. చెడిపోయిందంటూ దద్దోజనం మాటలు మాట్లాడే వారికి లాగి పెట్టి పీకినట్లుగా ఉండే ఉదంతాలు దేశంలో చాలానే ఉన్నాయి. ఈ తరహా కాంబినేషన్ మన దగ్గర ఎందుకు ఉండవు అంటే..రాజకీయ నాయకుడ్ని వ్యక్తిత్వం కాకుండా కులం.. మతం..వర్గం.. ప్రాంతం.. స్థాయి.. లాంటి చెత్తను మెదడు నిండా నింపేసుకుంటే నికార్సైన నేతలు ఎక్కడ నుంచి వస్తారు చెప్పండి?

ఎమ్మెల్యే అన్నంతనే కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టనిదే ఎన్నికల్లో గెలవలేరన్న దరిద్రపుగొట్టు మైండ్ సెట్ ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చెప్పే రియల్ నేతలు కనిపించరు కాక కనిపించరు. తల్లి ఒక స్కూల్లో స్వీపర్.. కొడుకు ఎమ్మెల్యే. అలా అని.. తల్లిని చూసుకునే విషయంలో కొడుకు ఎలాంటి తేడా లేదు. కానీ.. తన కొడుకును ఈ స్థాయికి తీసుకొచ్చేందుకుసాయం చేసిన స్వీపర్ ఉద్యోగాన్ని.. కొడుకు ఎమ్మెల్యే అయినంతనే ఎందుకు వదిలేయాలన్న ఆ తల్లి మాటలు.. ఆమె అభిప్రాయానికి విలువను ఇచ్చే కొడుకు.. ఇలాంటి కాంబినేషన్లు మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండు? అన్న భావన కలుగక మానదు. చదవినంతనే రీల్ కథ మాదిరి అనిపించే రియల్ స్టోరీలోకి వెళదాం.

పంజాబ్ రాష్ట్రంలోని బటిండా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ స్కూల్. ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం స్కూల్ ను ముస్తాబు చేస్తున్నారు. పిల్లలు.. టీచర్లు అందరూ ఎంతో బిజీబిజీగా ఉన్న అక్కడి వాతావరణంలో ఒక పెద్దావిడ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. చీపురుతో చిమ్మకుంటూ తన విధి నిర్వహణలో ఉంది. స్కూల్ కు వచ్చే అతిధి ఎవరో కాదు.. తన పనిలో నిమిగ్నమైన ఆ స్వీపరమ్మ కొడుకు కోసం. ఎందుకంటే.. అతడు స్థానిక ఎమ్మెల్యే కావటమే.

అలా అని పెద్ద హోదాలో ఉండి తల్లిని పట్టించుకోని రకం కాదు. తల్లంటే విపరీతమైన ప్రేమాభిమానాలే కాదు.. ఆమె భావాలకు విలువను ఇచ్చే ఆ ఎమ్మెల్యే పేరు లఖ్ సింగ్ ఉగోకే. అతగాడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆమ్ ఆద్మీ. ఇక.. ఆ స్వీపర్ అమ్మ పేరు బల్ దేవ్ కౌర్. జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకొని కూడా నిరాడంబరంగా జీవితాన్ని సాగించే కొందరు ఉంటారు. అందుకు నిలువెత్తు రూపం లఖా సింగ్.

ఇతగాడి మరో ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇతను ఎవరిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారో తెలుసా.. అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ చరణ్ జీత్ సింగ్ చన్నీని. కొడుకు ఎమ్మెల్యే అయినంతనే ఆ తల్లి తాను చేస్తున్న స్వీపర్ ఉద్యోగానికి రిజైన్ చేయలేదు. ఎందుకంటే.. పాతికేళ్లుగా తమకు అండగా నిలిచిన ఈ ఉద్యోగాన్ని కొడుకు ఎమ్మెల్యే అయితే వదిలేయాలా? అని సూటిగా ప్రశ్నిస్తుంది.

తల్లి పని చేస్తున్నస్కూల్ కు ఎమ్మెల్యే హోదాలో రావటం.. అయినప్పటికీ తల్లి మాత్రం ఆత్మన్యూనతకు గురి కాకుండా.. సంతోషంగా స్వీకరించటం ఆ అమ్మ గొప్పతనంగా చెప్పాలి. అలాంటి స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వారు మన దేశానికి చాలా చాలా అవసరం. కాదంటారా? ఇలాంటి తల్లీకొడుకులు తెలుగు రాష్ట్రాల్లోనూ పదిమంది ఉంటే.. తెలుగు రాజకీయాల్లో మార్పు ఖాయం. నిజం కాదంటారా?