Begin typing your search above and press return to search.

బీజేపీలోకి సుజనా చౌదరి.. ఇదే సాక్ష్యం

By:  Tupaki Desk   |   18 Jun 2019 2:30 PM GMT
బీజేపీలోకి సుజనా చౌదరి.. ఇదే సాక్ష్యం
X
ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడంతో తెలుగుదేశం పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో కొన్ని చెప్పుకోదగ్గ స్థానాలు వచ్చినా ఆ పార్టీలోని నాయకులు వేరే పార్టీల వైపు చూసే పరిస్థితి ఉండకపోయేది. కానీ మరీ దారుణంగా 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించడంతో టీడీపీ తన ఉనికిని కాపాడుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉండవన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు విని సంతోషించే లోపే.. భారతీయ జనతా పార్టీ రూపంలో సైకిల్ పార్టీకి కష్టాలు వచ్చి పడ్డాయి.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ ఒక్కటి. ఇక్కడ ఎలాగైనా బలపడాలని ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తుడు అయిన సుజనా చౌదరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కమలదళం పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో కొద్దిరోజులుగా సుజనా చౌదరి టీడీపీని వీడబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ మీడియా చానెల్‌ తో చిట్ చాట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ‘‘రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోడానికి చాలా కారణాలు ఉన్నాయి. మేము ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉంటే బాగుండేది. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా బీజేపీతో కలిసి ఉంటే రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునే వాళ్లం. మోదీ వేవ్ అంతలా పని చేసింది’’ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాగే ‘‘నేను టీడీపీని వీడడం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే చంద్రబాబుకు చెప్పే వెళ్లిపోతా’’ అని సుజనా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాదు, కొద్దిరోజులుగా ఆయన టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్తారంటూ వస్తున్న వార్తలకు ఇదే సాక్ష్యం అంటూ కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు, సుజనా చౌదరి ఈ కామెంట్లు చేయడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సీబీఐ ఆయనను టార్గెట్ చేయడంతోనే సుజనా మోదీకి మద్దతుగా మాట్లాడారనే టాక్ వినిపిస్తోంది.