Begin typing your search above and press return to search.

అఖిలేష్ కు అసలైన పరీక్షేనా ?

By:  Tupaki Desk   |   19 Feb 2022 9:31 AM GMT
అఖిలేష్ కు అసలైన పరీక్షేనా ?
X
ఉత్తర ప్రదేశ్ మూడో దశ పోలింగ్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు అసలైన పరీక్షగా నిలువబోతోందా ? విశ్లేషణలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మొదటి విడత పోలింగ్ ఎక్కువగా జాట్లున్న ప్రాంతంలో జరిగింది. రెండో దశ పోలింగ్ ఎక్కువగా ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతంలో జరిగింది. రేపు 20వ తేదీ జరగబోయే మూడో విడత పోలింగ్ యాదవులు ఎక్కువగా ఉండే 11 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో జరగబోతోంది.

జాట్లు, ముస్లింలు ప్రాబల్యముండే ప్రాంతాల్లో జరిగిన పోలింగ్ ఎస్పీకి అనుకూలంగా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మరి మూడో విడత పోలింగ్ లో ఏమవుతుందో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే 2017 ఎన్నికల్లో పై 59 నియోజకవర్గాల్లో బీజేపీ 49 చోట్ల గెలిచింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే పై నియోజకవర్గాల్లో బాగా పట్టున్న అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ ఎస్పీకి వ్యతిరేకం చేయటమే.

అబ్బాయ్ తో పడని కారణంగా బాబాయ్ శివపాల్ పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకున్నారు. దాంతో తర్వాత ఎన్నికల్లో ఎస్పీ దారుణంగా దెబ్బతినేసింది. బాబాయ్ కెపాసిటి ఏమిటో అర్ధమైన అబ్బాయ్ సయోధ్య కుదుర్చుకున్నాడు. మళ్ళీ శివపాల్ ను పార్టీలోకి తీసుకొచ్చుకున్నారు. కాబట్టే ఇపుడు అబ్బాయ్+బాబాయ్ కలిసే అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారమంతా శివపాలే భుజన వేసుకున్నారు.

కాబట్టి మూడో విడతలో కూడా తమకే ఆధిక్యత వస్తుందని అఖిలేష్ అనుకుంటున్నారు. అయితే 59 సీట్లలో ఎస్పీ ఎన్ని గెలుచుకుంటుందనే విషయమే కీలకమైంది. అఖిలేష్ లెక్క ప్రకారం మొదటి రెండు విడతల్లోనే ఎస్పీకి 100 సీట్లు వస్తాయట. మూడో విడతలో తక్కువల తక్కువ 50 దాకా వస్తాయని అంచనా వేసుకుంటున్నారు.

అంతేకాకుండా ఓ 40 సీట్లు వచ్చినా మంచి స్కోరనుకోవాల్సిందే. మిగిలిన నాలుగు దశల్లో జాగ్రత్తగా ప్లాన్ చేస్తే అధికారం తమదే అని అఖిలేష్ అంచనా వేస్తున్నారు. అందుకనే మూడో విడతలోనే మ్యాగ్జిమమ్ సీట్లు గెలుచుకోవాలనేది అఖిలేష్ ప్లాన్. చివరకు ఏమవుతుందో చూడాలి.