Begin typing your search above and press return to search.

బాబుపై ఐటీ దాడుల కిటుకు ఇదే: పవన్

By:  Tupaki Desk   |   25 Feb 2019 4:45 AM GMT
బాబుపై ఐటీ దాడుల కిటుకు ఇదే: పవన్
X
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలపై ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. కానీ సీబీఐ, ఐటీ దాడులు జరుగుతోందని ఏపీ ప్రజలపై కాదని.. టీడీపీ అవినీతి నాయకులపై అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కర్నూలులో నిర్వహించిన జనసేన సభలో పవన్ మాట్లాడారు. ప్రధాని మోడీ మార్చి1న విశాఖకు రావడాన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు.

కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకద్రోహం చేసిందని.. అంతకు పదింతలు టీడీపీ, చంద్రబాబు మోసం చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు బీజేపీపై నెపం మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి కారణం మీ అసమర్థత, నిర్లక్ష్యమని చంద్రబాబుపై జనసేనాని మండిపడ్డారు.

తాను రాయలసీమకు పుట్టకపోయినా సరే రాయలసీమ అభివృద్ధి కోసం చివరి వరకు పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నానని పవన్ హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రి వచ్చినా ఇంకా వెనుకబడిపోయిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.

గుంటూరులో జనసేన ప్రచార రథాలపై రాళ్లు వేసి మన మహిళల్ని గాయపరిచారని.. తమ జనసైనికుల మీదగానీ, ఆడపడుచుల మీద గాని దాడులు చేసినా అక్రమ కేసులు పెట్టినా సరే చూస్తూ కూర్చోనని హెచ్చరించారు.

జగన్ లా ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం లేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబులా మళ్లీ నేనే , ఆ తర్వాత మా అబ్బాయి సీఎం అని అనడం లేదని.. మీ అందరి జీవితాలు మారాలని కోరుకుంటున్నానని పవన్ చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని.. అన్ని వర్గాలకు దీంతో న్యాయం జరుగుతుందన్నారు.

మీ జీవితాలు మార్చడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని.. మీరు సీఎం పదవి ఇచ్చినా.. ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినా మీ ఇష్టమని.. మీ జీవితాల్లో మార్పు తీసుకువచ్చే వరకూ పోరాటం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. పెద్దలతో మార్పు రాదని.. ముప్పై ఏళ్ల యువతతో మార్పు వస్తుందన్నారు.