Begin typing your search above and press return to search.

కోకాపేట వేలంలో భూముల్ని సొంతం చేసుకున్న వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే

By:  Tupaki Desk   |   18 July 2021 3:33 AM GMT
కోకాపేట వేలంలో భూముల్ని సొంతం చేసుకున్న వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే
X
అదేంటి? ఈ-వేలం వేసి.. ఎక్కడా ఎలాంటి తప్పులు దొర్లకుండా నిర్వహించినట్లు చెప్పే కోకాపేట భూముల వేలం మీద ఆరోపణల మరక వేయటమా? ఇదెక్కడి న్యాయం? అన్న సందేహం పలువురికి కలుగుతుంది. ఎప్పుడూ లేనట్లుగా రికార్డు స్థాయిలో భూముల ధరలు పలికిన తర్వాత కూడా తప్పులు దొర్లటానికి అవకాశం ఉందా? అంత ఓపెన్ గా వివరాలు వెల్లడించిన తర్వాత కూడా అందులో మరేదో దాగి ఉంటుందా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. తరచి చూస్తే.. కోకాపేట భూములకు తాజాగా నిర్వహించిన వేలంలో ప్లాట్లు దక్కించుకున్న వారి వెనుక ఉన్నదెవరన్న విషయంపై తాజాగా బయటకు వస్తున్న వివరాలు సంచలనంగా మారుతున్నాయి.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా కోకాపేట భూముల్ని వేలంలో దక్కించుకున్న వారిపై కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం కోకాపేట భూముల్ని అక్వా స్పేస్.. రాజపుష్ప.. ఎంఎస్ఎన్ ఫార్మా.. ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. వర్సిటీ ఎడ్యుకేషనల్ మెనేజ్ మెంట్ లిమిటెడ్ సంస్థలు భూముల్ని దక్కించుకోవటం తెలిసిందే. ఈ వేలంలో ఎకరా రూ.60 కోట్ల అత్యధికంగా ధర పలకటం తెలిసిందే. అయితే.. ఇదే వేలంలో రూ.32 కోట్లకు ఎకరం అమ్ముడైన విషయం పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. ఒకే ప్రాంతంలో నిర్వహించే వేలంలో.. ఎకరం రూ.32 కోట్లు ఏంటి? మరోచోట ఎకరం రూ.60 కోట్లు ఏమిటి? అన్న సందేహానికి సమాధానం లభించని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం వెల్లడించిన వేలం విజేతల పేర్ల వెనుక ఉన్న అసలు పేరలు ఇవేనంటూ రేవంత్ వెల్లడించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆక్వాస్పేస్ పేరుతో వేలంలో బిడ్ వేసి విజయం సాధించిన ఈ సంస్థ మరెవరిదో కాదని.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన మైహోం సంస్థదని చెప్పారు. రాజపుష్ప సీనియర్ ఐఏఎస్ అధికారికి చెందినదని.. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి తమ్ముడు సత్యనారాయణ రెడ్డితో పాటు.. ఆయనకు చెందిన ఎంఎస్ఎన్ ఫార్మా కూడా బిడ్ ను సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు.

వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ పేరుతో వేలంలో భూమిని సొంతం చేసుకున్న సంస్థ మరెవరిదో కాదని.. శ్రీచైతన్య కళాశాలలకు చెందిన వారిదని పేర్కొన్నారు. కోకాపేట భూముల వేలం చిత్రంగా ఉందని.. ఎకరం రూ.60 కోట్లు ధర పలికిన భూమి పక్కనే భూమి ఎకరా రూ.30 కోట్లు ఎలా పలుకుతుందని ప్రశ్నించారు. అందరూ కూడబల్కుకొని రాష్ట్ర ఖజానాకు రావాల్సిన రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టినట్లుగా వ్యాఖ్యానించారు.

ఈ టెండర్లలో నిజంగా కేసీఆర్ కుటుంబానికి సంబంధం కానీ.. పాత్ర కానీ లేని పక్షంలో ఈ వేలం ప్రక్రియను రద్దు చేసి స్విస్ చాలెంజ్ విధానంలో టెండర్లు పిలవాలని.. ఎకరాకు కనీసం రూ.60 కోట్ల అప్ సెట్ ధర నిర్దారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని.. ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్ షాలకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎన్జీటీ ఉత్తర్వులు.. 111 జీవో కారణంగా ఈ భూముల్లో ఒక్క ప్లోర్ నిర్మాణానికే అనుమతి వస్తుందని.. ఈ భూముల్ని కొంటే నష్టోతారని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేత పలు కంపెనీల ప్రతినిదులకు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపించారు. వేలంలో పాల్గొనకుండా చేసినట్లు రేవంత్ ఆరోపించారు. ఇప్పుడాయన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి.