Begin typing your search above and press return to search.

మోడీ ఛాన్సు ఇచ్చిన మహిళా మంత్రుల బ్యాక్ గ్రౌండ్ ఇదే

By:  Tupaki Desk   |   8 July 2021 7:30 AM GMT
మోడీ ఛాన్సు ఇచ్చిన మహిళా మంత్రుల బ్యాక్ గ్రౌండ్ ఇదే
X
మూర్తీభవించిన మంచితనం.. అంతకు మించిన మాటకారి.. వ్యక్తిత్వ వికాస నిపుణుడికి ఉండాల్సిన లక్షణాల కంటే ఎక్కువగా ఉండే నేత ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటే? ఇలాంటి ప్రశ్నకు నిలువెత్తు రూపంలా కనిపిస్తారు నరేంద్ర మోడీ. ఏడేళ్ల క్రితం ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆయన ఇమేజ్ భారీగా ఉండేది. కరిగే కాలంతో పాటు ఆయనపై ప్రశంసల స్థానే విమర్శలు వెల్లువెత్తటం.. ఆయన జోరకు పగ్గాలు వేసేలా కరోనా మహమ్మారి మోడీ పాలనను మసకబారేలా చేసింది.

సుగుణాల కుప్పగా కనిపించే మోడీలోని లోపాల్ని పలువురు ఎత్తి చూపిస్తుంటారు. పెద్ద మనిషిలా వ్యవహరించే మోడీ.. తన మంత్రివర్గంలో మహిళలకు పెద్దపీట వేయటం తర్వాత.. కనీస స్థాయిలో ఎందుకు ఎంపిక చేయరన్న ప్రశ్న తలెత్తేది. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా ఆయన తాజాగా తన మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించారు. ఇప్పటివరకు నలుగురికి మాత్రమే ఉన్న మహిళా మంత్రులస్థానే.. తాజాగా ఏడుగురికి అవకాశం లభించింది. వీరిలో ఆరుగురు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరొకరు ఎన్డీయే భాగస్వామ్య పక్షమూన అప్నాదళ్ (ఎస్) ఎంపీ అనుప్రియ పటేల్ కూడా ఉన్నారు. మొత్తం 77 మంది ఉన్న కేబినెట్లో 11 మంది మహిళలు మంత్రులుగా వ్యవహరించనున్నారు.

మీనాక్షి లేఖి

ఢిల్లీ ఎంపీగా వ్యవహరిస్తున్న ఆమె.. న్యాయవాదిగా సుపరిచితురాలు. అమె వాగ్ధాటి అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. సామాజిక కార్యకర్త అయిన ఆమె.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కాంగ్రెస్ అంటే చాలు కస్సుమనే లక్షణం ఆమెకు ఎక్కువ. మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఆమె పలు సంస్థలతో కలిసి పని చేశారు.

శోభ కరంద్లాజే

ఫైర్ బ్రాండ్ గా సుపరిచితురాలైన ఆమె తరచూ వార్తల్లో కనిపిస్తుంటారు. కర్ణాటక బీజేపీలో కీలకభూమిక పోషించే ఆమె.. ఉడుపి చిక్ మగళూర్ నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె.. 2019లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు విధేయురాలిగా ఆమెకు పేరుంది. కర్ణాటక జనతా పార్టీ నుంచి 2012లో భారతీయ జనతాపార్టీలోకి చేరారు. ప్రజాసేవ చేయటం కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు.

అన్నపూర్ణదేవి

జార్ఖండ్ కు చెందిన ఈ బీజేపీ ఎంపీ కొడెర్మా ఎంపీ స్థానం నుంచి విజయం సాధించారు. మహిళా సాధికారిత కమిటీ సభ్యురాలిగా 2019 నుంచి వ్యవహరిస్తున్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. 1998-2000 మధ్యలో బిహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పని చేశారు.

దర్శన విక్రమ్ జర్దోశ్

గుజరాత్ కు చెందిన ఈ బీజేపీ ఎంపీ.. సూరత్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన ఆమె.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కూడా పని చేశారు. 2019 ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై 5.33లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి సంచలనంగా మారారు. ప్రస్తుతం మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నారు.

ప్రతిమ భౌమిక్

త్రిపుర బీజేపీఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె.. త్రిపుర ఈస్ట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ఆమె పని చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఈ మహిళా ఎంపీ తాజాగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఒక రికార్డును తన పేరు మీద నమోదయ్యేలా చేశారు. త్రిపుర నుంచి కేంద్రమంత్రిగా ఎంపికైన మొట్టమొదటి ఎంపీ ఆమే కావటం గమనార్హం. నార్త్ఈస్ట్ ప్రాంతం నుంచి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో ఎంపీగా నిలిచారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన డాక్టర్ త్రిగుణ సేన్ కేంద్రమంత్రిగా వ్యవహరించారు.

భారతి ప్రవీణ్ పవార్

మహారాష్ట్ర బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మహిళా ఎంపీ డిండోరి (ఎస్టీ) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాసిక్ లో ఎంబీబీఎస్ చేసిన ఆమె.. నైపుణ్యాభివృద్ధి.. ఎంటర్ ప్రెన్యూవర్ షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

అనుప్రియ సింగ్ పటేల్

ఎన్డీయే పక్ష నేతగా సుపరిచితురాలైన ఈమె అప్నాదళ్ (ఎస్) పార్టీ తరఫున విజయం సాధించారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి సహ వ్యవస్థపాకుడైన దివంగత నేత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తే ఈ అనుప్రియ సింగ్ పటేల్. ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్.. ఢిల్లీ వర్సిటీతో పాటు ఛత్రపతి సాహుజీ మహరాజ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. అప్నాదళ్ పార్టీ వ్యవస్థాపకుడు సోనేలాల్ పటేల్ కుమార్తె. ఆమె సైకాలజీలో మాస్టర్స్ తో పాటు ఎంబీఏ కూడా పూర్తి చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో ఆమె పార్టీ పొత్తు కుదుర్చుకుంది. తర్వాతి కాలంలో బీజేపీలో ఆమె పార్టీని విలీనం చేస్తారన్న మాట వినిపించింది.