Begin typing your search above and press return to search.

చిన్నమ్మ ఆధ్యాత్మిక యాత్రలో అసలు మర్మం ఇదే !

By:  Tupaki Desk   |   1 April 2021 4:30 PM GMT
చిన్నమ్మ ఆధ్యాత్మిక యాత్రలో అసలు మర్మం ఇదే !
X
రాజకీయాల నుండి పూర్తిగా సెలవు తీసుకున్న చిన్నమ్మ అలియాస్ తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ, ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే, చిన్నమ్మ ఆధ్మాత్మిక యాత్ర వెనుక ఓ భారీ రాజకీయ స్కెచ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 6న పోలింగ్ జరుగుతుండగా.. శశికళ మేనల్లుడు దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ఆప్, ఎంఐఎంతో కూటమిగా ఏర్పడి పోటీచేస్తోంది. ఆ పార్టీ తరఫున పలువురు బరిలో నిలిచినా కొన్నిచోట్ల గట్టిపోటీ ఇస్తున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి.

కోవిల్ ‌పట్టి, పాపనాశం, తిరుప్పరకుండ్రం, ముదుకుళత్తూరు, కున్నూరు, కారైక్కుడి, పొల్లాచ్చి, ఉసిలంపట్టి, తిరువాడనై, పాప్పిరెడ్డిపట్టి ఈ పది స్థానాల్లో ఆ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో ఒకవేళ ఏఎంఎంకే అభ్యర్థులు విజయం సాధిస్తే అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవచ్చనేది చిన్నమ్మ వ్యూహమని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఈ స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఆధ్యాత్మిక యాత్రకు శశికళ శ్రీకారం చుట్టినట్టు కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఆ స్థానాల్లో ఏఎంఎంకే గెలవపోయినా.. అత్యధిక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచినా చక్రం తిప్పొచ్చన్నది ఆమె వ్యూహంగా ఉందని ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ సీనియర్‌ నేత చెప్పుకొచ్చారు.

దీనికి తోడు రెండు రోజుల కిందట ఏఎంఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మాట్లాడుతూ.. త్వరలోనే అన్నాడీఎంకేను శశికళ స్వాధీనం చేసుకోనున్నారని, ఆమె పార్టీ బాధ్యతలను చేపడతారని, అన్నాడీఎంకేకు మూలస్తంభమని అన్నారు. సోమవారం కోవిల్‌పట్టిలోని శంబాగవల్లి పూవన్నతార్ ఆలయ సందర్శనకు వచ్చిన శశికళ వెంట సరస్వతి కూడా ఉన్నారు. శశికళ, దినకరన్ ‌లు తమిళనాడులో బలమైన నేతలుగా ఎదుగుతారని అన్నారు. డీఎంకేను ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని శశికళ కోరుకుంటుండగా.. సీఎం పళనిస్వామి మాత్రం ఆమె గొప్పదనాన్ని విస్మరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కోవిల్‌పట్టి అసెంబ్లీ స్థానం నుంచే దినకరన్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.