Begin typing your search above and press return to search.

ఏపీ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థుల ఆస్తుల్లో ఇదో రికార్డ్

By:  Tupaki Desk   |   15 May 2019 9:30 AM GMT
ఏపీ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థుల ఆస్తుల్లో ఇదో రికార్డ్
X
దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌రికొత్త లెక్క‌లు కొత్త‌గా వ‌స్తున్నాయి. బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల్లో సంప‌న్నుల సంఖ్య భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన మొత్తం అభ్య‌ర్థుల్లో 30 శాతం మంది కోటీశ్వ‌రులు కావ‌టం విశేషం. వాస్త‌వానికి ప్ర‌ధాన రాజ‌కీయ‌పార్టీలు ఎంపిక చేసిన అభ్య‌ర్థుల్లో అత్య‌ధికులు కోటీశ్వ‌రులే.

కాకుంటే.. స్వ‌తంత్య్ర అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగిన వారిలో చాలామంది ఆర్థికంగా ద‌న్ను లేక‌పోవ‌టంతో అంకెలు ఇలా ఉన్నాయి కానీ ప్ర‌ధాన పార్టీల్లో కోటీశ్వ‌రుల సంఖ్య చూస్తే భారీగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జాతీయ పార్టీల‌తో పోలిస్తే.. ప్రాంతీయ పార్టీలు బ‌రిలో దించిన అభ్య‌ర్థుల్లో అత్య‌ధికులు కోటీశ్వ‌రులే ఉన్నారు. ఏపీ అధికార‌ప‌క్ష‌మైన టీడీపీ త‌ర‌ఫున తాజాగా బ‌రిలోకి దిగిన పాతిక మంది లోక్ స‌భ అభ్య‌ర్థుల్లో వంద శాతం మంది కోటీశ్వ‌రులే కావ‌టం ఒక రికార్డుగా చెప్పాలి. ఇలా నూటికి నూరుశాతం కోటీశ్వ‌రుల‌ను అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దించిన పార్టీలు చాలా త‌క్కువే ఉన్నాయి.

వాస్త‌వానికి.. టీడీపీ అభ్య‌ర్థుల్లో ప‌లువురు వంద‌ల కోట్ల‌కు ఆస్తిప‌రులుకావ‌టాన్ని మ‌ర్చిపోలేం. టీడీపీ మాదిరి ఫుల్ సౌండ్ పార్టీల‌ను ఎన్నిక‌ల బ‌రిలో దించిన ప్రాంతీయ పార్టీల జాబితాలో శిరోమ‌ణి అకాలీద‌ళ్‌.. అన్నాడీఎంకే పార్టీలు మాత్ర‌మే ఉన్నాయి. డీఎంకే 96 శాతం మంది అభ్య‌ర్థులు కోటీశ్వ‌రులు అయితే.. ఆర్జేడీ అభ్య‌ర్థుల్లో 90 శాతం మంది కోటికి మించిన ఆస్తులున్న వారే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన వారిలో 88 శాతం మంది కోటీశ్వ‌రులు అయితే.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు రెండు స‌మానంగానే కోటీశ్వ‌రుల‌ను రంగంలోకి దించాయి.

బీజేపీ 83.4 శాతం కోటీశ్వ‌రులు కాగా.. కాంగ్రెస్ అభ్య‌ర్థులు 83.1 శాతం కోటీశ్వ‌రులు. ఈ రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య వ్య‌త్యాసం చాలా త‌క్కువ‌గా చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కోటీశ్వ‌రుల్ని బ‌రిలోకి అతి త‌క్కువ‌గా దింపిన పార్టీల్లో బీఎస్పీ నిలుస్తోంది. ఆ పార్టీ త‌ర‌ఫున 33.8 శాతం మంది మాత్ర‌మే కోటీశ్వ‌రులు ఉండ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. జాతీయ‌.. ప్రాంతీయ పార్టీలు ఏవైనా స‌రే డ‌బ్బుకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌టం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌కమాన‌దు.