Begin typing your search above and press return to search.

గాంధీల చేత‌.. గాంధీల కోసం.. కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితం ఇదే!

By:  Tupaki Desk   |   17 Oct 2022 9:32 AM GMT
గాంధీల చేత‌.. గాంధీల కోసం.. కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితం ఇదే!
X
137 ఏళ్ల చ‌రిత్ర ఉన్న పార్టీ. దేశాన్ని 50 ఏళ్ల‌కుపైగానే ఏలిన పార్టీ. అదే.. జాతీయ‌ కాంగ్రెస్ పార్టీ. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌ని చాటే.. ఈ పార్టీకి దాదాపు 24 ఏళ్ల త‌ర్వాత‌.. అధ్య‌క్ష పీఠం కోసం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అదికూడా.. గాంధీయేత‌ర కుటుంబాల‌కు చెందిన నాయ‌కులు పోటీప‌డుతు న్నారు. కర్ణాటకకు చెందిన సీనియర్‌ నాయకుడు, ద‌ళిత నేత‌ మల్లికార్జున ఖర్గే, కేరళకు చెందిన తిరువనంతపురం ఎంపీ, నాయ‌ర్ వ‌ర్గానికి చెందిన‌ శశి థరూర్‌లు.. పోటీ పడుతున్నారు. వీరిలో థ‌రూర్ ఆది నుంచి పోటీలోఉండ‌గా.. ఖ‌ర్గే మాత్రం మ‌ధ్య‌లో అంటే.. నామినేష‌న్ల‌కు ముందు తెర‌మీదికి వ‌చ్చారు.

అలా.. ఇద్ద‌రు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఇది పైకి క‌నిపిస్తున్న వాస్త‌వం. కానీ, నిజం ఏంటంటే.. వీరిద్ద‌రూ కూడా.. గాంధీల చేత‌, గాంధీల వ‌ల‌న‌.. గాంధీల కోస‌మే ఇప్పుడు అధ్య‌క్ష‌రేసులో కుస్తీప‌డుతున్నార‌నేది! అంతేకాదు.. కేవ‌లం ఎన్నిక లాంఛ‌న‌మే. ఎందుకంటే.. గాంధీల కుటుంబం, పార్టీలో సీనియర్లు ఖర్గేకే మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని పార్టీ నేతలే చెబుతున్నారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి అయితే.. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయులే రంగంలో ఉండ‌డం మ‌రింత చిత్రంగా ఉంది.

దీనికి ఉదాహ‌ర‌ణ ఏంటంటే. .. తాను ఎలిచిన త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి.. ఎలా న‌డిపించాలి.. అనే విష‌యాల్లో గాంధీల కుటుంబం నుంచి స‌ల‌హాలు తీసుకుంటాన‌ని.. ఈ విష‌యంలో ఏమాత్రం సంకోచించ‌ని..

మ‌ల్లికార్జున ఖ‌ర్గే కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇక‌, థ‌రూర్ ఏకంగా.. కాంగ్రెస్‌లో గాంధీల డీఎన్ ఏ ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గాంధీల కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి.. ఎవ‌రూ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేర‌ని.. ఎలాంటి అడుగు ముందుకు వేయ‌లేర‌ని.. ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఇక‌, ఈ ప‌రిణామాల‌ను అవ‌లోకిస్తే.. ఎవ‌రు గెలిచార‌న్నది ముఖ్యం కాదు.. ఎవ‌రు గెలిచినా.. గాంధీలే.. గాంధీల కుటుంబ‌మే పార్టీని న‌డిపిస్తుంది. కేవ‌లం వ్య‌క్తులు మార‌తారు.. డైరెక్ట‌ర్ మాత్రం.. గాంధీల కుటుంబ‌మే. వాస్త‌వానికి ఈ డైరెక్ట‌ర్‌ను మార్చాల‌నేదే పార్టీలో ప్ర‌ధాన డిమాండ్ అయితే..

దీనిని మారుస్తు న్నామ‌ని చెబుతూనే.. మ‌ళ్లీ త‌న ఆధిప‌త్యంలోనే పార్టీని ముందుకు న‌డిపించ‌నుంద‌నేకామెంట్లు వినిపిస్తున్నాయి. సో.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు.. కేవ‌లం.. రికార్డుల కోస‌మేన‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.