Begin typing your search above and press return to search.

అస‌లు జాక్‌పాట్ అంటే ఇదీ.. లాట‌రీలో రూ.25 కోట్లు!

By:  Tupaki Desk   |   19 Sep 2022 4:07 AM GMT
అస‌లు జాక్‌పాట్ అంటే ఇదీ.. లాట‌రీలో రూ.25 కోట్లు!
X
బ‌ళ్లు ఓడ‌లవుతాయి.. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి అంటే ఇదేనేమో. ఒక ఆటో డ్రైవ‌ర్ రాత్రికి రాత్రే కోటేశ్వ‌రుడు అయిపోయాడు. లాట‌రీలో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకోవ‌డంతో అత‌డి ద‌శ తిరిగింది. అప్పుల‌పాలై ఇక విదేశాల‌కు వెళ్లిపోయి బ‌తుకుదామ‌ని నిర్ణ‌యించుకుని.. రూ.3 లక్ష‌ల బ్యాంకు లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌రుస‌టి రోజే అత‌డి సుడి తిరిగి రూ.25 కోట్ల లాట‌రీని ఎగ‌రేసుకుపోయాడు.

ఈ సంగ‌తికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకెళ్తే.. కేర‌ళ రాష్ట్ర రాజ‌ధాని తిరువనంతపురంలోని శ్రీవరాహమ్‌ ప్రాంతానికి చెందిన అనూప్‌ ఆటో డ్రైవర్ గా ప‌నిచేస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల‌తో అప్పుల‌పాల‌య్యాడు. మ‌లేషియా వెళ్లి చెఫ్‌గా పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల బ్యాంకు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేశాడు.

కాగా గ‌త 22 ఏళ్లుగా కేర‌ళ లాట‌రీ టికెట్ల‌ను అనూప్ కొంటూ వ‌స్తున్నాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వంద‌ల రూపాయ‌ల నుంచి గ‌రిష్టంగా రూ. 5 వేల వ‌ర‌కు మాత్ర‌మే అత‌డు గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో ఎప్పటిలాగే సెప్టెంబ‌ర్ 17న శ‌నివారం అతడు లాటరీ టిక్కెట్‌ (TJ750605) కొనుగోలు చేశాడు. తొలుత ఎంచుకున్న టిక్కెట్‌ నచ్చకపోవడంతో వేరేదాన్ని ఎంపిక చేసుకోగా అదే అత‌డి జీవితాన్ని మార్చేసింది.

తాను లాట‌రీలో గెలుస్తాన‌ని న‌మ్మ‌లేక‌పోయాయ‌ని అనూప్ చెబుతున్నారు. ఎవ‌రో చెబితే న‌మ్మ‌లేదు కూడా అని అంటున్నారు. అందుకే టీవీలో లాట‌రీ ఫ‌లితాల‌ను కూడా చూడ‌లేద‌న్నారు. ఇంటికెళ్లి త‌న‌ భార్యకు చూపిస్తే లాట‌రీ గెలుచుకున్న నంబ‌ర్ ఇదేన‌ని తెలిపింద‌న్నాడు.. అనూప్. అప్పుడు కూడా త‌న‌కు ఇంకా సందేహంగా ఉంద‌న్నాడు. అప్పుడు లాట‌రీ టికెట్ల అమ్మే ఒక మ‌హిళ‌కు పంపితే ఆమె త‌న‌కు లాట‌రీ వ‌చ్చింద‌ని ధ్రువీక‌రించాడు. అప్పుడు మాత్ర‌మే త‌న‌కు లాటరీ వ‌చ్చింద‌ని న‌మ్మానంటున్నాడు.

ఈ లాట‌రీ డ‌బ్బులు రావ‌డంతో ఇక మ‌లేషియా వెళ్ల‌న‌ని అనూప్ చెబుతున్నాడు. అప్ప‌ల‌న్నీ తీర్చేసి మంచి ఇల్లు క‌ట్టుకుంటాన‌ని తెలిపాడు. కాగా అనూప్ రూ.25 కోట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ ప‌న్నుల‌న్నీ మిన‌హాయించ‌గా అనూప్‌గా రూ.15 కోట్లు మాత్ర‌మే వ‌స్తాయి. అప్పులు తీర్చేయ‌డం.. ఇల్లు క‌ట్టుకోవ‌డ‌మే త‌న మొద‌టి ప్రాధాన్య‌త అని అనూప్ వివ‌రించాడు. అంతేకాకుండా ధాన‌ధ‌ర్మాలు చేస్తాన‌ని.. అలాగే త‌న బంధువుల‌కు కూడా కొంత మొత్తాన్ని ఇస్తాన‌ని తెలిపాడు.

ఆటో తోల‌డం మానేసి కేరళలో ఏదైనా హోటల్‌ని ప్రారంభిస్తాన‌ని అనూప్ పేర్కొన్నాడు. అలాగే, ఇకపైనా లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు. లాటరీలో గెలిచిన తర్వాత లాట‌రీ టికెట్లు విక్ర‌యించే ఏజెన్సీ వద్దకు తన భార్యతో కలిసి అనూప్ రావ‌డంతో అక్కడ సంద‌డి నెల‌కొంది.

మ‌రోవైపు ఎన్నో ఏళ్లుగా తాము లాటరీ టిక్కెట్లు కొంటున్నామని అనూప్ భార్య తెలిపింది. లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్నాక‌ తమకు అనేక ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని వెల్ల‌డించింది. కాగా అనూప్ మొదటి బ‌హుమ‌తి కింద రూ.25 కోట్లు గెలుచుకోగా.. సెకండ్‌ ప్రైజ్‌ రూ.5 కోట్లు. అది (TG270912) టిక్కెట్‌కు దక్కింది. అదనంగా మరో 10 మంది రూ.కోటి చొప్పున గెలుచుకోవ‌డం విశేషం. అంతకుముందు నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతల నంబర్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ ప్రకటించారు. కాగా కేర‌ళ‌లో లాట‌రీ టికెట్లు విక్ర‌యించ‌డంపై నిషేధం ఏమీ లేదు.

గతేడాది కూడా ఓనమ్‌ బంపర్‌ ఆఫర్‌ ఓ ఆటో డ్రైవర్‌కే ద‌క్క‌డం గ‌మ‌నార్హం. కోచి న‌గ‌రానికి సమీపంలోని మారడుకు చెందిన జయపాలన్‌ పీఆర్‌ అనే ఆటో డ్రైవర్‌ గతేడాది రూ.12 కోట్ల లాటరీ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.