Begin typing your search above and press return to search.

రూ.5 కోట్ల వాచ్ ల స్వాధీనంపై స్పందించిన క్రికెటర్ హార్ధిక్ పాండ్యా

By:  Tupaki Desk   |   16 Nov 2021 5:36 AM GMT
రూ.5 కోట్ల వాచ్ ల స్వాధీనంపై స్పందించిన క్రికెటర్ హార్ధిక్ పాండ్యా
X
ప్రపంచకప్ టీ20లో పేలవ ప్రదర్శనతో విమర్శలు కొనితెచ్చుకున్న టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డారు. అతడికి తాజాగా కస్టమ్స్ అధికారులు షాకిచ్చారు. విదేశీ వాచ్ లను కలిగి ఉన్నందుకు సీజ్ చేశారు.

టీమిండియా క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వద్ద ముంబై ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు రెండు విదేశీ చేతి గడియరాలను గుర్తించారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ పూర్తయ్యాక యూఏఈ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వాటిని కనుగొన్నారు. ఆయా వాచ్ లకు సంబంధించిన రశీదులు పాండ్య వద్ద లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

హార్ధిక్ పాండ్యా వద్ద స్వాధీనం చేసుకున్న వాచ్ ల విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం. మరోవైపు గత ఏడాది కూడా హార్ధిక్ సోదరుడు కృణాల్ పాండ్యా కూడా ఇలాగే దొరికిపోయాడు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు అధికారులు పలు వాచ్ లతో సహా భారీ మొత్తంలో బంగారం గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

హార్ధిక్ పాండ్యాకు వాచ్ లంటే పిచ్చి. వాటిని మ్యాచ్ సందర్భాల్లో కూడా ప్రదర్శిస్తుంటారు. ఎక్కడ ఏ దేశం వెళ్లినా వాచ్ లు కొనడం అలవాటు. 5 కోట్ల విలువైన వాచ్ లను కొన్నాడంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్తలపై హార్దిక్ పాండ్యా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కొట్టిపారేశాడు. పాండ్యా తన సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. వాచీల విలువ రూ. 1.5 కోట్లని, మీడియాలో ప్రసారం అవుతున్న రూ. 5 కోట్లు కాదని పేర్కొన్నాడు.

"నేను దుబాయ్ నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. అయితే కస్టమ్స్ డ్యూటీకి సరైన వాల్యుయేషన్ చేస్తోంది, నేను వాటికి పన్ను చెల్లించాలని ఇప్పటికే ధృవీకరించారు” అని హార్ధిక్ పాండ్యా సోషల్ మీడియాలో ప్రకటించారు.

వాచీల ధర ట్యాగ్‌పై ఉందని.. వాచ్ ఖరీదు దాదాపు రూ. 1.5 కోట్లు అని, సోషల్ మీడియాలో తిరుగుతున్న పుకార్ల ప్రకారం రూ. 5 కోట్లు కాదని హార్ధిక్ క్లారిటీ ఇచ్చారు. "నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నేను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను గౌరవిస్తాను. నేను ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ కు అన్ని సహకారాలు అందిస్తాను. వారికి నా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను. ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి వారికి అవసరమైన చట్టబద్ధమైన పత్రాలను అందజేస్తాను” అని ముంబై ఇండియన్స్ క్రికెటర్ పేర్కొన్నాడు. హార్దిక్ చట్టపరమైన అన్నింటిని పాటించానని.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు.

క్రికెటర్ల ఖరీదైన వస్తువులను కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కూడా ఇదే సమస్యలో చిక్కుకున్నాడు. పాండ్య సోదరులు లగ్జరీ ఉత్పత్తులను కలిగి ఉండటంలో పేరుగాంచారు మరియు వాటి కారణంగా తరచుగా ఇబ్బందుల్లో పడతారు.