Begin typing your search above and press return to search.

ప్రస్తుతానికి జగన్ మీద పవన్ టార్గెట్ ఇదేనట

By:  Tupaki Desk   |   13 Nov 2019 6:28 AM GMT
ప్రస్తుతానికి జగన్ మీద పవన్ టార్గెట్ ఇదేనట
X
అరే.. ఎంతగా ప్రిపేర్ అయి ప్రెస్ మీట్ పెట్టి నా.. ప్రతిపక్ష నేతగా తాను వేసే పంచ్ లు పెద్దగా పని చేయటం లేదన్న వేదన జనసేనాని పవన్ కల్యాణ్ లో అంతకంతకూ ఎక్కువ అవుతుందట. తన అస్థాన విద్వాంసులు వండిన పంచ్ డైలాగుల్ని బాగా ప్రాక్టీస్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటి కే.. తన రాజకీయ ప్రత్యర్థులు వేసే పంచ్ లకు పవన్ గాలి పోవటమే కాదు.. వారు వేస్తున్న ముద్రలు ప్రజల్లో బాగా రిజిస్టర్ కావటం పీకే ను తెగ వేధిస్తోందట.

తన పై బాబు ముద్ర వేసిన ఏపీ అధికార పక్షం చేసే ప్రచారాన్ని ఎలా తిప్పి కొట్టాలో అర్థం కాక పవన్ పరివారం కిందా మీదా పడుతున్నారట. నిజానికి ఈ ప్రచారమే ఎన్నికల్లో దెబ్బ తీయటమే కాదు.. చివరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలు అయ్యేలా చేస్తుందన్న మాట పార్టీ నేతలు సైతం ఒప్పుకుంటున్న పరిస్థితి.

పవన్ అంటే చంద్రబాబు దత్త పుత్రుడని.. పవన్ అంటే బాబుకు మహా ప్రేమ అని.. జనసేనినా పవన్ నాయుడంటూ చేస్తున్న ప్రచారం ప్రజల్లో రిజిస్టర్ కావటంతో పాటు.. పీకే ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. దీనికి తోడు పవన్ తప్పులు కూడా అదే తీరు లో ఉన్నాయన్న మాటా వినిపిస్తోంది.

ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్లు గా చెప్పిన పవన్ కల్యాణ్.. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ విమర్శించింది లేదంటున్నారు. అదేమంటే.. ప్రభుత్వం పవర్లో కి వచ్చి మూడేళ్లు కాకుండానే విమర్శలు చేస్తారా? అని రివర్స్ లో ప్రశ్నించటం ద్వారా తనకున్న కమిట్ మెంట్ ఎలాంటిదన్న విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పేవారు.

ఇలాంటి తీరు కూడా ప్రజల్లో పీకే మీద నమ్మకాన్ని తగ్గించేలా చేసింది. ప్రతిపక్షం లో ఉన్న వేళ పవన్ మీద ప్రయోగించిన అస్త్రాన్నే.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఫార్ములా ను అమలు చేయటం ద్వారా ఇరుకున పెడుతోంది. తన మీద వేసిన బాబు ముద్ర నుంచి పవన్ బయటకు రాలేక కిందామీదా పడుతున్నారు.

ఇటీవల పవన్ తో భేటీ అయిన ఆయన సన్నిహితులు.. ఏపీ అధికార పక్షం వేస్తున్న బాబు ముద్ర నుంచి బయటకు రాలేక పోతే మరిన్ని సమస్యలు తప్పవన్న మాటను చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి పవన్ సైతం అంగీకరించినట్లు గా సమాచారం. ఏపీ సీఎం జగన్ మొదలు విజయసాయి రెడ్డి.. మంత్రులు ఇలా అందరూ ఒకేలా మాట్లాడటం.. చంద్రబాబు..పవన్ ఇద్దరూ ఒకేటనన్న రీతి లో వేస్తున్న ముద్రలు పీకే కు ఇప్పుడు పెద్ద తలనొప్పి గా మారిందంటున్నారు.

దీన్ని అధిగమించేందుకు బెజవాడ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లోబాబు మీద జనసేనాని విమర్శలు చేసినా.. అవేమీ పెద్దగా రిజిస్టర్ కాలేదన్న మాట జనసేన వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ అధినేత మీద పడిన బాబు ముద్రను చెరుపుకోవటమే తమకున్న తొలి సవాలుగా ఆ పార్టీకి చెందిన వారు చెబుతున్నారు. పవన్ ను అంతగా ఇబ్బంది పెడుతున్న బాబు ముద్ర నుంచి బయటపడటానికి ఏదేదో చేయాల్సిన అవసరం లేదని.. కాస్తంత చిత్తశుద్ధి తో బాబు తీరు ను తప్పు పడితే చాలన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి మాటలు పవన్ చెవిన పడతాయా?