Begin typing your search above and press return to search.

షాతో మీటింగ్ లో జగన్ తీసుకొచ్చిన పాయింట్లు ఇవేనట

By:  Tupaki Desk   |   23 Oct 2019 5:47 AM GMT
షాతో మీటింగ్ లో జగన్ తీసుకొచ్చిన పాయింట్లు ఇవేనట
X
కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వారిద్దరి మధ్య సమావేశం 43 నిమిషాల పాటు సాగింది. జగన్ తో కలిసి పార్టీ ఎంపీలు షాను కలిశారు. అనంతరం షా.. జగన్ లు ముఖాముఖిన మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. షాకు ఏ మాత్రం నచ్చని ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ ను మరోసారి తెర మీదకు తీసుకొచ్చారు.

రాష్ట్ర విభజన కారణంగా ఏపీ వైపు పరిశ్రమలు.. సేవా సంస్థలు చూడాలంటే ప్రత్యేక హోదా ఇవ్వా్ల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చెప్పటేమ కాదు.. హోదా లేని కారణంగా వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీలు ఏపీని చూడటం లేదని చెప్పారు. చెన్నై.. బెంగళూరు.. హైదరాబాద్ కాకుండా ఏపీని ఎంపిక చేసుకోవటానికి వీలుగా హోదా డిమాండ్ అంశాల్ని పరిశీలించాలని కోరారు.

తమ భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని జగన్ పదే పదే విన్నవించారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు.. రెవెన్యూ లోటు భర్తీతో పాటు ఇతర అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. దానికి సంబంధించిన ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

2014-15కు రెవెన్యూ లోటును కాగ్ తో సంప్రదించి సవరిస్తామంటూ గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జగన్ కోరటమే కాదు.. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి.. రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు పెండింగ్ లో ఉన్న రూ.1050 కోట్లనుతక్షణం ఇవ్వాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరిన జగన్.. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ.. పునరావాస ప్యాకేజీ కోసం రూ.16వేల కోట్లు ఇవ్వాలని కోరారు. అంతేకాదు.. పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంలో రూ.838కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాల విషయంపై అమిత్ షాతో జగన్ వివరంగా మాట్లాడటమే కాదు.. తమ డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరినట్లు తెలుస్తోంది.