Begin typing your search above and press return to search.

గొడ్డు మాంసం తినాలని ఖురాన్లో చెప్పలేదంట

By:  Tupaki Desk   |   5 Aug 2015 10:21 AM IST
గొడ్డు మాంసం తినాలని ఖురాన్లో చెప్పలేదంట
X
ఒక వర్గం వారు పవిత్రంగా పూజించే ఆవును.. ఆహారంగా వాడటాన్ని వ్యతిరేకించటం తెలిసిందే. దీనిపై కొన్ని రాష్ట్రాల్లో గోవధ నిషేధం అమలు చేస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో గొడ్డు మాంసం తినాల్సిందేనంటూ కొందరు వాదనలు చేయటంపై మతం రంగు పులుముకోవటం తెలిసిందే. ఒకరి నమ్మకాల్ని మరొకరు గౌరవించటం ద్వారా అనవసర సమస్యలకు చెక్ చెప్పొచ్చు. అయితే.. మైనార్టీలకు పెద్ద పీట వేసే దేశంలో.. మెజార్టీల వాదనను సంకుచిత దృష్టితో చూడటం మామూలే.

అదేమని అడిగితే.. మైనార్టీల ఆహార అలవాట్లను కూడా నిర్దేశిస్తారా? అన్న ప్రశ్న వేయటం కనిపిస్తుంది. దీనిపై ఎవరైనా బలంగా తమ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తే.. వారిపై మతం ముద్ర వేసేయటం మామూలే. లౌకికవాదులు మైనార్టీల్ని వెనకుసుకొచ్చి.. మైనార్టీల మతం గురించి ప్రస్తావిస్తే లేని తప్పు.. మెజార్టీల వాదన వినిపించిన వ్యక్తి లౌకికవాదిగా కాకుండా.. మతతత్వ వాదిగా ముద్రేయటం చూస్తే ఇదంత కొన్ని వర్గాల తెలివితేటలకు నిదర్శనంగా చెప్పొచ్చు.

గోవధ నిషేధానికి అనుకూలంగా ఒక ముస్లిం ఎమ్మెల్యే గళం విప్పటమే కాదు.. ఆవుల్ని వధించటం తప్పు అంటూ తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఇందుకోసం మత గురువులతో ప్రచారం చేయాలని నిర్ణయించటం విశేషం. ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హాజీ జమీరుల్లా ఖాన్ ఆవుల్ని వధించటం తప్పని వాదిస్తున్నారు.

హిందువులు తమ సోదరులని.. వారు గోవుల్ని పూజిస్తారని.. అందుకే వారి సెంటిమెంట్లకు గౌరవించాలని చెబుతున్నారు. అంతేకాదు.. గొడ్డు మాంసం తినాలని ఖురాన్ లో ఏమీ చెప్పలేదని..అవసరమైతే.. గోవధ గురించి ఖురాన్ ప్రవచనకర్తలతో చర్చకు తాను సిద్ధమేనని ఆయన చెబుతున్నారు. సెంటిమెంట్లు ఒక వర్గానికి మాత్రమే ఉంటాయని చెప్పే లౌకికవాదులు.. ఎమ్మెల్యే ఖాన్ మాటలకు ఏం సమాధానం ఇస్తారో..