Begin typing your search above and press return to search.

ఈ ఆదివారం ఎంతో స్పెషల్: ఒకేరోజు ఏడు ఉత్సవాలు

By:  Tupaki Desk   |   20 Jun 2020 7:15 AM GMT
ఈ ఆదివారం ఎంతో స్పెషల్: ఒకేరోజు ఏడు ఉత్సవాలు
X
ఈ ఆదివారం (21 జూన్) ఎంతో స్పెషల్. ప్రత్యేక దినాలన్నీ ఆదివారమే ఉన్నాయి. ఏకంగా ఏడు ఉత్సవాలు ఒకే రోజు కలిసొచ్చాయి. యోగా దినోత్సవంతో పాటు తండ్రుల దినోత్సవం తదితర ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..

యోగా దినోత్సవం
భారత ప్రభుత్వం సూచన మేరకు ఐక్యరాజ్యసమితి జూన్‌ 21వ తేదీని ‘అంతర్జాతీయ యోగా దినం’గా గుర్తించింది. 2015 నుంచి యోగా డేను నిర్వహించుకుంటున్నాం. ఏడాది మొత్తం మీద పగటిపూట ఎక్కువగా ఉండే రోజులు జూన్‌ 20, 21, 22. అందుకే ఈ మూడు రోజుల్లో మధ్య రోజు 21వ తేదీని యోగా డేకి ఎంపిక చేశారు.

తండ్రుల దినోత్సవం (ఫాదర్స్‌ డే)
వాస్తవంగా తండ్రుల దినోత్సవానికి పక్కా తేదీ లేదు. కానీ జూన్ మూడో ఆదివారం నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈసారి ఫాదర్స్‌ డే జూన్‌ 21న వచ్చింది. కుటుంబ భారం మోసే తండ్రిని గౌరవించుకోవడం ఈరోజు ఉద్దేశం.

మ్యూజిక్‌ డే
జూన్ 21ని వరల్డ్‌ మ్యూజిక్‌ డేగా పరిగణిస్తారు. ఫ్రెంచి సాంస్కృతిక శాఖ మంత్రి జాక్‌ లాంగ్, ఫ్రెంచి సంగీతకారుడు ఫ్లు హెమోవిస్‌ కలిసి మ్యూజిక్‌ డే నెలకొల్పారు. తొలిసారి పారిస్‌లో 1982 జూన్‌ 21న ప్రపంచ సంగీత దినోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత నుంచి భారత్ తో పాటు 120 దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని చేసుకుంటున్నాయి. సంగీతకారులను సత్కరించుకోవడం ఈ డే ఉద్దేశం.

వరల్డ్‌ హ్యూమనిస్డ్‌ డే
ఈ రోజును హ్యూమనిస్ట్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ‘వరల్డ్‌ హ్యూమనిస్డ్‌ డే’ ప్రారంభించింది. మానవత్వమే జీవిత పరమార్థం అనే భావనను పెంపొందించేందుకు అనేక మానవ హక్కుల సంస్థలు చేతులు కలపడంతో హ్యూమనిస్ట్‌ డే ఆవిర్భవించింది. 1980 నుంచి ఒక పరిణామక్రమంలో ఈ ‘డే’ జరుగుతూ వస్తోంది. ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి ఆధారాల్లేవు.

హ్యాండ్‌ షేక్‌ డే
ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ‘వరల్డ్‌ హ్యాండ్‌షేక్‌ డే’ను చేసుకోలేం. సముద్రపు నీళ్లలో చెయ్యి పెట్టి, చేతిని కదిలిస్తూ ప్రపంచమంతటికీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చినట్లుగా అనుభూతి చెందడం ఈ డే ఉద్దేశం. తర్వాత చేయి చేయి కలపడంగా మారిపోయింది. ఇవాన్‌ జుపా అనే ఒక అలౌకిక చింతనాపరుడు దీన్ని కనుగొన్నారు.

హైడ్రోగ్రఫీ డే
‘ఇంటర్నేషనల్‌ హైడ్రోగ్రఫిక్‌ ఆర్గనైజేషన్‌’ ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో 2005 నుంచి జూన్‌ 21న ‘వరల్డ్‌ హైడ్రాలజీ డే’ ని నిర్వహిస్తోంది. హైడ్రోగ్రఫీ అంటే అర్థం జల వనరుల భౌతిక స్వరూపాల, కొలమానాల విజ్ఞాన శాస్త్రం అని.

టీ షర్ట్‌ డే
జర్మనీలోని బెర్లిన్ లో తొలిసారి 2008లో ఇంటర్నేషనల్‌ టీ షర్ట్‌ డే నిర్వహించారు. జర్మనీలోని ఫ్యాషన్‌ దుస్తుల ఉత్పత్తిదారులు వ్యాపారం కోసం టీ షర్ట్‌ డేని గుర్తించారు. యూత్‌ ఎక్కువగా ఈ ‘డే’ని ఫాలో అవుతుంటారు.